
సాక్షి, హైదరాబాద్: మండే ఎండలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గోశాలలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలు కనుగొనే లక్ష్యంతో ఈ నెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లకడీకాపూల్‌లోని శ్రీ వాసవి సేవా కేంద్రంలో రాష్ట్రస్థాయి గోశాలల నిర్వాహకులు, గోపోషకుల సదస్సు నిర్వహిస్తున్న సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు 'విజయ్ రామ్' మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోని గోశాలల నిర్వాహకులు, గో పోషకులను ఈ సదస్సుకు సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా నుంచి గోశాలల నిర్వాహకులు 9052286688 నంబరుకు ఫోన్ చేసి పేర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సుభాష్ పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా ఆవులను పంపిణీ చేసే ఆలోచన ఉందని విజయ్ రామ్ తెలిపారు. పచ్చిగడ్డి, వరి గడ్డి కొరతతో పాటు వైద్యం, తాగునీరు కూడా గోశాలలకు పెను సమస్యలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.