ఫుడ్ ‌..సారీ నో ఆర్డర్‌..

Covid Effect: Flight Catering Companies Lost Crores Of Rupees - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ దెబ్బకు ఫ్లైట్‌ కేటరింగ్‌ సంస్థలు కుదేలయ్యాయి. ఎనిమిది నెలలుగా కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయాయి. మరోవైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడింది. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రతిరోజు సుమారు 7500 నుంచి 8 వేలకు పైగా అల్పాహారాలు, భోజనాలు, స్నాక్స్‌ సరఫరా చేసే స్కైచెఫ్‌ సంస్థ ప్రస్తుతం రోజుకు 1200 నుంచి 1300 మీల్స్‌ మాత్రమే అందజేస్తోంది. ప్రస్తుతం స్పైస్‌జెట్, ఎయిర్‌ ఇండియా, విస్తారా, బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 12 విమానాలకు మాత్రమే ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన స్కైచెఫ్‌ గతంలో అనేక అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు ఆయా దేశాలకు చెందిన ఆహార పదార్థాలు, స్నాక్స్‌ అందజేసేది. జర్మనీకి చెందిన ఎల్‌ఎస్‌జీ సంస్థ కూడా హైదరాబాద్‌ కేంద్రంగా పలు జాతీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు కేటరింగ్‌ సదుపాయాలను అందజేసింది. కానీ ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు మాత్రమే ఈ సదుపాయాన్ని కొనసాగిస్తోంది.

పడిపోయిన ఆర్డర్లు.. 
కేటరింగ్‌ సంస్థలకు ఎయిర్‌లైన్స్‌ నుంచి వచ్చే ఆర్డర్లు కోవిడ్‌ కారణంగా 75 శాతం వరకు పడిపోయాయి. కోవిడ్‌కు ముందు ప్రతి రోజు సుమారు రూ.2 కోట్ల చొప్పున ఆర్జించిన స్కైచెఫ్‌  ప్రస్తుతం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకే పరిమితమైంది. ప్రయాణికులకే కాకుండా ఎయిర్‌లైన్స్‌ క్రూ సిబ్బందికి, పైలెట్‌లకు కూడా ఈ సంస్థ  ఎవరికి కావాల్సిన ఆహార పదార్థాలను వారికి విడివిడిగా అందజేస్తోంది. ప్రస్తుతం వందేభారత్, ఎయిర్‌ బబుల్స్‌ ఒప్పందంలో భాగంగా లండన్‌తో పాటు మరికొన్ని సౌదీ అరేబియా దేశాలకు మాత్రమే విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి మరో 40 నగరాలకు డొమెస్టిక్‌ విమానాలు తిరుగుతున్నాయి. గతంలో ప్రతి రోజు 55000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా ప్రస్తుతం ఆ సంఖ్య 2వేల నుంచి 22వేలకు పరిమితమైంది.  

అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువే. మరోవైపు కోవిడ్‌ దృష్ట్యా చాలా మంది ప్రయాణికులు ఇంటి వద్దే తయారు చేసిన ఆహార పదార్థాలను వెంట తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ దృష్ట్యా కేటరింగ్‌ సంస్థల ఆహార పదార్థాలకు ఆదరణ తగ్గినప్పటికీ సాధారణంగా అయితే ప్రయాణికులు ఎక్కువగా హైదరాబాద్‌ బిర్యానీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత మసాలా దోశ, వడ, ఊతప్పం, టోమాటో ఉప్మా వంటి దేశీయ అల్ఫాహారాలు, ముస్లీ, పాన్‌కేక్, చికెన్‌ బ్రస్ట్, పాస్తా, చీజ్, లాంబ్‌ రోస్టెడ్, వెజ్‌పఫ్‌ వంటి అంతర్జాతీయ వంటకాలున్నాయి. 

అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం..  
కోవిడ్‌ దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నాయి. విమానాల్లోకి ఆహార పదార్థాలను చేరవేసే హై లోడర్లు, ట్రక్కులతో పాటు డిషెష్‌ సహా అన్నీ శానిటైజ్‌ చేస్తున్నాం. వంటపాత్రలు ప్రతిరోజు స్టెరిలైజ్‌ చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు కచి్చతంగా పాటిస్తున్నాం. సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం,. 
– అరుణ్, క్వాలిటీ కంట్రోల్‌ మేనేజర్, స్కై చెఫ్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top