ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే

Covid Deaths Less In Telangana Compare To Other States - Sakshi

ప్రాణాపాయం తక్కువే

తెలంగాణలో కరోనా ఉధృతి ఉన్నా తక్కువగానే మరణాలు

మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఒడిశాలో అధిక మరణాల రిస్క్‌

దేశవ్యాప్తంగా జన్యుమార్పులపై సీఎస్‌ఐఆర్‌ విశ్లేషణలో వెల్లడి

వేగంగా వ్యాక్సినేషన్‌తో మరణాలు తగ్గించొచ్చని కేంద్రానికి సూచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికం గా ఉన్నప్పటికీ డెత్‌ రిస్క్‌ మాత్రం అతితక్కువగా నమోదవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి ప్రజల జన్యుమార్పు క్రమమేనని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు అనుబంధంగా పనిచేస్తున్న జీనోమిక్స్‌ సంస్థ విశ్లేషించింది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమై దాదాపు ఏడాదిన్నర అవుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు పరిశోధనలు చేశాయి. ఇదే క్రమంలో కరోనా మరణాలకు సంబంధించి జన్యుమార్పుల ఆధారంగా సీఎస్‌ఐఆర్‌ ప్రతినిధుల బృందం లోతైన అధ్యయనం చేసింది. అంతర్జాతీయంగా 100 రకాల జన్యుమార్పులను ఆధారంగా తీసుకున్న అధ్యయన బృందం... అందులో తొలి 8 మార్పులను ప్రామాణికంగా తీసుకొని ఆ మేరకు పరిశోధన సాగించింది. అందులో 2 రకాల జన్యుమార్పులు దేశీ యంగా సరిపోలాయి. ఆర్‌ఎస్‌-10735079, ఆర్‌ఎస్‌-2109069 రకానికి చెందిన జన్యుమార్పులు భారతీయుల్లో సరిపోలగా అవి ఏయే రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయో అధ్యయన బృందం పరిశీలించింది. జాతీయ జీనోమ్‌ కోడ్‌ ఆధారంగా ఈ పరిశోధన సాగింది.

25 ప్రాంతాలుగా విభజన...
దేశాన్ని 25 రకాల భౌగోళిక ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించి అక్కడి ప్రజల జన్యుక్రమాన్ని నమోదు చేసింది. భాష, సంస్కృతి, గిరిజన తెగలు, కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా ఈ ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌ఐఆర్‌ తాజా పరిశోధన జియోగ్రాఫికల్‌ రీజియన్ల ఆధారంగా సాగింది. దేశీయంగా గుర్తించిన 2 రకాల జన్యుమార్పులు ఎక్కువగా గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు అంచనా వేస్తూ ఆయా రాష్ట్రాలను రిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించారు. ఇక రిస్క్‌ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిస్క్‌ ఎక్కువున్న ప్రాంతాలను ఎంపిక చేసి వేగవంతంగా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని సీఎస్‌ఐఆర్‌ సూచిస్తోంది. రిస్క్‌ తక్కువున్న చోట కూడా వ్యాక్సినేషన్‌ జరపాలని, అయితే ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తే మరణాల రేటును తగ్గించవచ్చని సీఎస్‌ఐఆర్‌ కేంద్రానికి సూచించింది.

ఆర్థిక సర్వే ప్రకారం...
దేశంలో కరోనా మరణాలకు సంబంధించిన గణాంకాలను కేంద్రం ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్‌ సర్వేలో ప్రస్తావించింది. ఇందులో కరోనా వైరస్‌ ప్రభావంతో ఎక్కువ మరణాలు గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్‌లలో నమోదైనట్లు ప్రకటించింది. అలాగే తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ, బిహార్, అస్సాం, జార్ఖండ్‌ రాష్ట్రాలున్నాయి. జీనోమ్‌ స్టడీ ఆధారంగా సీఎస్‌ఐఆర్‌ వెల్లడించిన వివరాలతో కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్‌ సర్వే వివరాలు దాదాపుగా సరిపోలడం గమనార్హం.

సెకండ్‌ వేవ్‌లోనూ అవే ప్రాంతాలు
కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాలే సెకండ్‌ వేవ్‌లోనూ తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న సమయంలో ఆ ప్రాంతాల్లో రిస్క్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రాంతాలవారీగా ప్రభావాన్ని పరిశీలిస్తే మానవ జన్యుమార్పులు ఒక కారణం కావచ్చు. రిస్క్‌ ప్రాంతాల గుర్తింపులో ఇలాంటి పరిశోధనలు కీలకపాత్ర పోషిస్తాయి.
- డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ వైద్య కళాశాల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top