ఏడాది చివరికి కొవాక్జిన్‌

Covaxin at the end of the year says governor - Sakshi

గవర్నర్‌ తమిళిసై ఆశాభభారత్‌ బయోటెక్‌ సందర్శన

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌కు సరైన వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం హైదరాబాద్‌ వైపు చూస్తోందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మంగళవారం ఆమె జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ కంపెనీని సందర్శించారు. కోవిడ్‌ నిర్మూలన కోసం తయారుచేస్తున్న కొవాక్జిన్‌ వ్యాక్సిన్‌ గురించి అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ తయారీకి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారంటూ వారిని ప్రశంసించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొవాక్జిన్‌ వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సమర్థమైన, సరసమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను మన శాస్త్రవేత్తలు తీసుకొస్తారని యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. ‘తక్కువ ధరతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వ్యాక్సిన్‌ చేరేలా చూడాలి. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితి, జాతీయతతో సంబంధం లేకుండా అందరికీ టీకా అందాలి’అని ఆమె ఆకాంక్షించారు. కొవాక్జిన్‌ పరిశోధనలకు నాయకత్వం వహించినందుకు డాక్టర్‌ సుమిత్రా ఎల్లాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రుగ్మతలకు మూడు బిలియన్ల డోసుల వేర్వేరు వ్యాక్సిన్లను రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న భారత్‌ బయోటెక్‌కు గవర్నర్‌ అభినందనలు తెలిపారు. కంపెనీ వ్యవస్థాపకులు డాక్టర్‌ కృష్ణ ఎల్లా, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top