ప్రాణాలు తీస్తున్న ఫీజులు | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కాలేజీల వేధింపులతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్న విద్యార్థులు 

Published Sat, Aug 20 2022 2:44 AM

corporate colleges fees harassment Students suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, రంగారెడ్డి జిల్లా:  అడ్డూ అదుపూ లేని కార్పొరేట్‌ కాలేజీల దోపిడీ, ధనదాహం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఫీజులు చెల్లించలేని నిస్సహాయ పరిస్థితుల్లో, ప్రైవేటు కాలేజీల వేధింపులు భరించలేక, తల్లిదండ్రుల ఆవేదన చూడలేక బలవన్మరణాలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫీజు చెల్లించలేదని ఇంటర్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో శుక్రవారం హైదరాబాద్‌ రామాంతపూర్‌ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది.

మాదాపూర్‌లోని మరో కాలేజీలో కొన్ని నెలల క్రితం విద్యార్థి ఆందోళనకు దిగే వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో ఫీజు చెల్లించే వరకు క్లాసులకు రావొద్దంటూ ఓ విద్యార్థిని వేధించడంతో, విద్యార్థి తీవ్ర మానసిక వేదనకు గురై మీడియాను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలెన్నో జరుగుతున్నా ఇంటర్‌ బోర్డు కానీ, విద్యామంత్రిత్వ శాఖ కానీ స్పందించిన దాఖలాల్లేవని, కిందిస్థాయి సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల వరకు ముడుపులు అందడం వల్లే కార్పొరేట్‌ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

నిబంధనలు ఉల్లంఘించి నిర్వహణ 
రాష్ట్రంలో 1,606 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటన్నింటికీ ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు (అఫ్లియేషన్‌) ఇస్తుంది. ఇప్పటివరకు 1480 కాలేజీలు అఫ్లియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో 643 కాలేజీలకు అనుమతులిచ్చారు. వీటిల్లో సింహభాగం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న కార్పొరేట్‌ కాలేజీలే కావడం విశేషం. అఫ్లియేషన్‌ ఇచ్చేటప్పుడు అనేక అంశాలను ఇంటర్‌ బోర్డు పరిశీలించాల్సి ఉంటుంది. కాలేజీకి 8 వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆటస్థలం తప్పనిసరి. లేబొరేటరీతో పాటు సెక్షన్‌కు ఇద్దరు అధ్యాపకులుండాలి. 9 సెక్షన్లకు మించి ఉండకూడదు. ప్రతి సెక్షన్‌లో 88 సీట్లు అనుమతిస్తారు. భవనానికి ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌ ఉండాలి.

కానీ చాలా కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా అదనపు సెక్షన్లు నడుపుతున్నారు. ప్రాక్టికల్స్‌ చేయించిన పాపాన పోవడం లేదు. సైన్స్‌ గ్రూపులతో పాటు, ఆర్ట్స్, కామర్స్‌ గ్రూపులూ ఉండాలి. కానీ కార్పొరేట్‌ కాలేజీల్లో అసలీ గ్రూపులే ఉండటం లేదు. ఇక ఒకటీ అరా కాలేజీల్లో మినహా ఆటస్థలం అనేదే ఉండటం లేదు. కొన్ని కాలేజీలకు ఒకచోట పర్మిషన్‌ ఉంటే మరోచోట నిర్వహిస్తున్నారు. అరకొరగా ఉండే అధ్యాపక సిబ్బందికి అతి తక్కువ వేతనాలిస్తూ, ఫీజుల విషయంలో విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.  

ఆలస్యమైతే అంతే.. 
ప్రైవేటు జూనియర్‌ కాలేజీల ఫీజులపై కచ్చితమైన చట్టం లేకపోవడం కార్పొరేట్‌ కాలేజీల పాలిట వరంగా మారింది. ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ అంటూ భారీయెత్తున ప్రచారంతో కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో అనేక కష్టాలు పడుతూ ఆయా కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాలేజీలు ఫీజులు పిండేస్తున్నాయి. కాలేజీని బట్టి కనీస వార్షిక ఫీజు రూ.60 వేలుంటే, గరిష్టంగా రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చేరిన వెంటనే ఫీజులో సగం కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మిగతా మొత్తం రెండు నెలల్లో చెల్లించాలంటున్నారు. వారం రోజులు ఆలస్యమైనా విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు.

ఫీజు చెల్లించకపోతే క్లాసులో నిలబెడుతున్నారని, క్లాసు నుంచి బయటకు వెళ్లిపొమ్మంటూ అందరిలో అవమానిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు పదేపదే మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారు. క్లాసులకు హాజరుకానివ్వడం లేదు. చివరి అస్త్రంగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. ఉన్నత తరగతుల్లో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. 

ఆ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి
కార్పొరేట్‌ కాలేజీల ధన దాహం పేద విద్యార్థులకు శాపంగా మారింది. రామంతాపూర్‌ నారాయణ కాలేజీ ఉదంతమే దీనికి నిదర్శనం. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు తక్షణమే స్పందించాలి. ఈ తరహా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలి. నారాయణ కాలేజీలో ఆత్మహత్య ప్రయత్నంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నారాయణ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి. 
– ప్రవీణ్‌రెడ్డి (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) 

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన 
నారాయణ సంస్థలతో పాటు ఇతర కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం దారుణం. రామంతాపూర్‌ నారాయణ కళాశాల వేధింపులు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వేధింపులకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు అధికారులు.. కార్పొరేట్‌ కాలేజీల దోపిడీని అడ్డుకోవాలి.  
– టి. నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి) 

ముడుపుల ఆరోపణలపై విచారణ జరపాలి 
నారాయణ, చైతన్య కాలేజీలు నడిపే హాస్టళ్ళకు అనుమతుల్లేవని ఇంటర్‌ బోర్డే తేల్చి చెప్పింది. అయినా ఆ కాలేజీలు య«థేచ్ఛగా హాస్టళ్లు నడుపుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బోర్డు అధికారులకు వారినుంచి ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. 
– మాచర్ల రామకృష్ణ గౌడ్‌ (తెలంగాణ ఇంటర్‌ విద్య పరిరక్షణ కమిటీ కన్వీనర్‌)
చదవండి: అగ్గి రాజేసిన ఫీజు

Advertisement
 
Advertisement
 
Advertisement