చికిత్సకు నిరాకరిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు

Coronavirus: Private Hospitals Rejects Treatment To Fever Patients In Karimnagar - Sakshi

కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు జ్వరంగా ఉండడంతో నగరంలోని చాలా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లింది. ఎక్కడా ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రాలేదు. డాక్టర్‌స్ట్రీట్‌లోని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు కరోనా పరీక్ష చేయించుకుంటేనే వైద్యం చేస్తామని వెల్లడించారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు చేయించుకున్నానని చెప్పినా... హెచ్‌ఆర్‌ సీటీస్కాన్‌ తప్పకుండా చేసుకోవాలని చిట్టీ రాసి ఇచ్చారు. ధర ఎంత అంటే రూ.5500 అని చెప్పారు. కూలీ పని చేసుకునే పద్మ చేతిలో రూ.వెయ్యి మాత్రమే ఉండడంతో చివరకు కోవిడ్‌ చికిత్స నడుస్తున్న ప్రభుత్వాసుపత్రికి చేరింది. ఇది ఒక్క ఆమె పరిస్థితి కాదు. నగరంలోని చాలా మంది పేదల పరిస్థితి ఇదే.

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలో టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రాథమికంగా కరోనా పరీక్ష చేయించుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లా ఆసుపత్రితో సహా అన్ని పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిత్యం నిర్వహిస్తున్నారు. అనుమానితులు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతుండడంతో జ్వరంతో బాధపడుతున్న వారు కరోనా పరీక్ష చేయించుకొని వైద్యం కోసం వెళ్లడం అసాధ్యమే అవుతోంది. ఆసుపత్రికి వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక నరకం చూస్తున్నారు. పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయించుకొని వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.

ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసులకు చికిత్స నడుస్తుందని భయపడే వారు సాధారణ జ్వరమే కదా అని ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడ చుక్కలు చూపిస్తున్నారు. జ్వరమా.. అయ్యో డాక్టర్‌ లేరండీ అని సమాధానం చెబుతున్నారు. లేదంటే హెచ్‌ఆర్‌ సీటీ స్కాన్‌ చేయించుకొని వస్తే వైద్యం చేస్తామని పొమ్మనలేక పొగబెడుతున్నారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు చేయించుకున్నామని చెప్పినా.. సిటీ స్కాన్‌ ఉంటేనే వైద్యం చేస్తామని తెగేసి చెబుతున్నారు. హెచ్‌ఆర్‌ సీటీస్కాన్‌కు నగరంలో రూ.5500 వసూలు చేస్తున్నారు. వైద్యం ఖర్చులకే అప్పులు చేసే నిరుపేదలు ఇక స్కానింగ్‌ ఎలా చేయించుకుంటారు. వైద్యమెలా పొందుతారు. 

కరోనా రోగుల మధ్య..
కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా పాజిటివ్‌ పేషెంట్లతోపాటు ప్రమాదాల బారిన పడిన వారు, జ్వర పీడితులు, ఇతర రోగులకు చికిత్స అందిస్తున్నారు. కరో నా అనుమానిత లక్షణాలైన జ్వరం, శ్వాస అందకపోవడం వంటి వాటితో ఎవరైనా వస్తే కోవిడ్‌ వార్డుకు తరలిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లాక కరోనా వైరస్‌ బారిన పడిన వాళ్ల మధ్యలో ఉంచి మిగతా వారికీ వైద్యం అందిస్తున్నారు. ఇలా వీరి మధ్య ఉంచితే వైరస్‌ బారిన పడకుండా ఉంటామా అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సీటీ స్కాన్‌ల దందా...
ప్రైవేటు ఆసుపత్రులలో ర్యాపిడ్‌ యాటిజెన్, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా నమ్మడం లేదు. హెచ్‌ఆర్‌సీటీ స్కాన్‌ తీయించుకుంటేనే వైద్యం చేస్తామని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు చెప్పడం శోచనీయం. గతంలో రూ.1800 నుంచి రూ.2 వేలకు తీసే సీటీ స్కాన్‌ ఇప్పుడు రూ.5500 నుంచి రూ.6 వేలకు చేరింది. అయినా పీపీఈ కిట్‌ ధర అదనంగా వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులకు సీటీస్కాన్‌ నిర్వాహకులకు మధ్య జరిగిన ఒప్పందంలో 50 శాతం కమిషన్‌ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సిటీ స్కాన్‌ను పంపిస్తే రూ.2500 ఆసుపత్రి అకౌంట్‌లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో అవసరం ఉన్నా లేకున్నా సీటీ స్కాన్‌కు రెఫర్‌ చేస్తున్నారు.

కొత్తగా 164 పాజిటివ్‌ కేసులు..
జిల్లాలో గురువారం 164 కరోనా పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. కరోనా బాధితుల సంఖ్య 8500కు చేరింది. కేసుల తీవ్రత పెరుగుతున్నా ప్రజల్లో భయం లేకుండా పోయింది. మాస్కులు, భౌతిక దూరం మాటే మరిచారు. గుంపులుగా తిరుగుతూ కరోనాను ఆహ్వానిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top