గ్రామాల్లో తగ్గిన ఉపాధి..

Corona Epidemic That Damaged The Economy - Sakshi

పట్టణాల్లో పుంజుకోని ఉద్యోగాల కల్పన  

ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన కరోనా మహమ్మారి 

సీఎంఐఈ తాజా పరిశీలనలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వివిధ సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వివిధ రంగాల్లో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కోవిడ్‌ మహమ్మారి దాదాపు అన్ని రంగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన అవకాశాల తగ్గుదల, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి రంగాలు ఇంకా పుంజుకోకపోవడం వంటి కారణాలతో భారత లేబర్‌ మార్కెట్‌ ఒత్తిళ్లకు గురవుతోంది.  

ఉపాధి కల్పనే మందు.. 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన ద్వారా లేబర్‌ మార్కెట్‌ పుంజుకునేలా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఉపాధి కల్పన రేట్‌ మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవడం సవాళ్లతో కూడుకున్నదని, ఇందుకోసం ఆర్థికరంగం అదనపు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన అవసరముందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా విశ్లేషణలో పేర్కొంది. అఖిలభారత స్థాయి అంచనాల్లో గ్రామీణ భారతానికి అధిక ప్రాధాన్యం ఉన్నందున అక్కడ ‘ఎంప్లాయ్‌మెంట్‌ రేట్‌’ దిగజారకుండా చూడాల్సిన అవసరముందని తెలిపింది.

ఆర్థికరంగం ఒడిదుడుకులు.. 
అక్టోబర్‌ తొలి 3 వారాల్లో సగటు గ్రామీణ ఎంప్లాయ్‌మెంట్‌ రేట్‌ 39.1 శాతం ఉండగా, సెప్టెంబర్‌లో 39.8 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సగటు ఎంప్లాయ్‌మెంట్‌ రేట్‌ అక్టోబర్‌ మొదటి 3 వారాల్లో 34.8 శాతం కాగా, సెప్టెంబర్‌లో 34.4 శాతంగా ఉంది. కరోనాతో గత ఏప్రిల్‌ నెలలో తలెత్తిన తీవ్ర పరిస్థితుల ప్రభావం కారణంగా భారత ఆర్థిక రికవరీ ప్రక్రియ స్తబ్ధతకు గురైనట్టు సీఎంఐఈ విశ్లేషించింది. ఆ స్థితి నుంచి ఆర్థిక రంగం గత మేలో బాగానే కోలుకోగా, జూన్‌లోనూ మెరుగైన స్థితిలో ఉంటూ జూలైలోనూ అదే కొనసాగినట్టు వెల్లడించింది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌లలో అది నిలిచిపోయి, అక్టోబర్‌లోనూ స్తబ్ధత కొనసాగిందని పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top