ఎకానమీకి ‘రుణ’ పునరుత్తేజం!

Loan Restructuring Plan Will Help Revive Economy - Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

అవసరమైతే మరోసారి మారటోరియం తరహా చర్యలు ఉంటాయని సూచన

సరళ వడ్డీరేట్ల విధానం వైపే మొగ్గు

స్టాక్‌ మార్కెట్‌లో సర్దుబాటు జరగాలి

వాస్తవ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించకపోవడమే కారణం...  

ముంబై: బ్యాంకింగ్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణ ఆర్థికరంగం పునరుత్తేజానికి దోహదపడుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ విశ్లేషించారు.  రుణ పునఃచెల్లింపులకు తగిన సమయం కల్పించడం వల్ల ద్రవ్య లభ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంస్థలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన అన్నారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ వల్ల వ్యాపార పునరుద్ధరణ జరుగుతుందని, దీనితో ఉపాధి అవకాశాలకు విఘాతం కలగదని గవర్నర్‌ అన్నారు.   అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందన్నారు.  ఒక వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► భారత స్టాక్‌ మార్కెట్‌ సర్దుబాటు జరగాలి. వాస్తవ ఆర్థిక పరిస్థితిని మార్కెట్‌ ప్రతిబింబించడం లేదు.  
► ఒకవైపు బ్యాంకుల ఆర్థిక పరిపుష్ఠి ఎంతో ముఖ్యమైన అంశం. మరోవైపు కోవిడ్‌–19 నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న చిన్న వ్యాపార సంస్థల ప్రయోజనాల పరిరక్షణా ముఖ్యం. ఈ రెండు అంశాల సమతౌల్యతకు తగిన ప్రయత్నం జరుగుతుంది.  
► రుణ చెల్లింపులపై మారటోరియం గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. ‘‘మారటోరియం’’ అనేది తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము.  
► ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద  కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలు తీసుకోడానికి బ్యాంకులకు తగిన సౌలభ్యత ఉంటుంది.  
► కరోనా వైరస్‌ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతునివ్వడానికి పాలనా, అధికార యంత్రాంగం తగిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. మొండిబకాయిలు 2 దశాబ్దాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో ఫైనాన్షియల్‌ రంగం స్థిరత్వం అవసరం. ఆర్థిక వృద్ధికి దోహదపడే దిశలో రుణ వృద్ధి జరిగేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్‌బీఐ అవసరమైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.  
► కంపెనీల రుణ పునర్‌వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన  సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్‌ 6 లోపు ప్రకటించడం జరుగుతుంది. ఏ అకౌంట్‌కు సంబంధించి రుణ పునర్‌వ్యవస్థీకరణ అవసరమో బ్యాంకులు అంతర్గతంగా ఒక నిర్ధారణకు రాగలుగుతాయి.
► రుణ పునర్‌వ్యవస్థీకరణ రియల్టీ రంగానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం.  
► కరోనాపై పోరులో మనం విజయం సాధిస్తాము. అయితే దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. అయితే విజయం మాత్రం కచ్చితంగా మనదే.  
► సరళతర ద్రవ్య పరపతి విధానంవైపే ఆర్‌బీఐ మొగ్గుచూపుతోంది. వడ్డీరేట్లు తగ్గుదలకే అవకాశం ఉంది.  అయితే అత్యంత జాగరూకత, పరిపక్వతతో ఈ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ద్రవ్యోల్బణం అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.  
► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై నిర్ణయించాల్సింది కేంద్రమే. దీనిపై కేంద్రం అడిగితే, ఆర్‌బీఐ తన అభిప్రాయాలను తెలియజేస్తుంది.  
► ప్రైవేటు బ్యాంకుల యాజమాన్య సమీక్షకు ఆర్‌బీఐ  అంతర్గత కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది.  సెప్టెంబర్‌లో ఇది తుది నివేదికను అందజేస్తుంది.

మొండిబకాయిల ప్రస్తుత స్థితి...
2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఇటీవల విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో స్వయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొనడం ఇక్కడ గమనార్హం.  ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ  రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్‌ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం.  

రుణ నిబంధనలు తరచూ మార్చేయొద్దు
బ్యాంకులకు ఆర్‌బీఐ సూచన
ముంబై: వ్యాపార సంస్థలకిచ్చే రుణాలకు సంబంధించిన నిబంధనలను సహేతుక కారణాలు లేకుండా తరచూ మార్చేయొద్దని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంకు సూచించింది. రుణ సదుపాయాలను సమీక్షించేందుకు క్రమబద్ధంగా నిర్దిష్ట కాలవ్యవధిని నిర్దేశించాలని, మధ్యలో పదే పదే సమీక్షలు జరపడాన్ని నివారించాలని పేర్కొంది. సమీక్ష ఎప్పుడెప్పుడు జరపాలి, ఏ విధానాలను పాటించాలి తదితర అంశాలకు సంబంధించి బోర్డు ఆమోదిత విధానాన్ని రూపొందించుకోవాలని తెలిపింది. బ్యాంకులు ఒక్కో రకంగా భారీ స్థాయిలో వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వం ఉద్దీపనలు ఇస్తున్నా వ్యాపార సంస్థలకు తగు విధంగా ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా ఆదేశాలు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top