అన్యాయమని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? 

Congress Leader NP Venkatesh Says Mahabubnagar Becoming As Rayalaseema - Sakshi

రోడ్డెక్కిన బాధిత కుటుంబాలు

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాకేంద్రంలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన బాధిత కుటుంబాలు మంగళవారం తెలంగాణ చౌరస్తాలో ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు ఎన్‌పీ వెంకటేశ్‌ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ను మరో రాయలసీమ ప్రాంతంగా మార్చడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 23న నాగరాజు, 24న విశ్వనాథ్, యాదయ్య కిడ్నాప్‌ కాగా, ఈ నెల 25న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ పోలీసులు రిమాండ్‌ చేశారన్నారు. గులాం హైదర్‌ అనే వ్యక్తిపై కత్తులతో దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్‌లో ఎస్‌వీఎస్‌ లాడ్జి సమీపంలో అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు.

మహబూబ్‌నగర్‌లో ఓ వీఐపీకి గులాం హైదర్‌ సన్నిహితుడని.. రాఘవేందర్‌రాజు చేసే అక్రమాలను హైదర్‌ ఎత్తి చూపుతున్నందుకు ఆయనను హత్య చేసేందుకు వచ్చినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో ఇచ్చారని, ఇది  సరికాదన్నారు. గులాం హైదర్‌కు, యాదయ్య, విశ్వనాథ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 23న టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అమర్‌ కొడుకును పోలీసులు తీసుకెళ్లారని.. 24న అమర్‌ తండ్రి దొరికాడని కొడుకును విడిచిపెట్టారని ఆరోపించారు.

అన్వర్‌ అనే వ్యక్తి ఈనెల 24న కిడ్నాప్‌ అయ్యారని తెలిపారు. వీళ్లు దేశ ద్రోహులా, లేక టెర్రరిస్టులా..ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. ఈనెల 23న తన భర్త కిడ్నాప్‌ అయ్యాడని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే.. సదరు సీఐ ‘‘నీ భర్త రెండు రోజుల్లో వస్తాడని, పెద్దపెద్ద రాజకీయ నేతలతో మీకు ఎందుకు’’అని ప్రశ్నించినట్లు నాగరాజు భార్య గీత చెప్పారు. మళ్లీ తర్వాత రోజు స్టేషన్‌కు వెళితే మీ భర్తను చర్లపల్లి జైలుకు పంపించారని చెబితే, జైలు దగ్గరికి నేను వెళ్లి కలిసేందుకు ప్రయత్నిస్తే అవకాశం ఇవ్వలేదని,  రాత్రి 9 గంటలకు భర్తతో మాట్లాడించారని చెప్పింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top