
స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో కాంగ్రెస్ కేడర్‌లో అయోమయం
పార్టీ, నామినేటెడ్ పదవులు లేక ఇప్పటికే నిరాశలో నేతలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై హై కోర్టు స్టే విధించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువ డిన నేపథ్యంలో కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. ఇప్పుడు అసలు ఎప్పుడు ఎన్నికలు జరు గుతాయో, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అర్థం కాక కింది స్థాయి కేడర్ అయోమయంలో పడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు అవు తున్నా అటు పార్టీ పదవులు కానీ, ఇటు నామినేటెడ్ పదవు లు కానీ లేకపోవడంతో నిరాశా నిస్పృహలు నెలకొన్నా యని, ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సైతం బ్రేకులు పడడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.
కేడర్‌కు దిశానిర్దేశం ఏదీ?: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఏ మేరకు అమలవుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ కేడర్‌కు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఓ స్థాయి నాయకత్వం వరకు మాత్రమే చేరగా, సాధారణ కార్యకర్తల్లో మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ‘రిజర్వేషన్ల గురించి మాకు అవగాహన ఉంది. ఈ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎన్ని కలు జరిగే అవకాశం కూడా లేదనే స్పష్టత మాకుంది.
కానీ, గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలకు ఈ అవగాహన లేదు. ఎన్నికలు జరుగుతాయని అందరూ అనుకున్నారు. నోటిఫికే షన్ కూడా రావడంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని నామినే షన్లకు సిద్ధమవుతున్న తరుణంలో కోర్టు స్టే విధించడం గందరగోళానికి తెరతీసింది.’ అని ఓ మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల సంగతి ఎలా ఉన్నా ఏదో రూపంలో వీలున్నంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మేలనే అభిప్రాయం క్షేత్రస్థాయి నాయకత్వంలో వ్యక్తమవుతోంది.
రిజర్వేషన్లపై ముందుకే..
రిజర్వేషన్ల విషయంలో ముందుకే వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికల కు వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఏఐసీసీ ఆలోచన కూడా ఇదే తరహాలో ఉందని తెలుస్తోంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు వెళితే ఇతర రాష్ట్రాల్లో కూడా మార్గదర్శకంగా ఉంటామని, తాము బీసీలకు న్యాయం చేస్తామని తెలంగాణను చూపించి దేశ వ్యాప్తంగా చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని ఏఐసీసీ భావిస్తోంది.
పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించడం కన్నా కోర్టులు, రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ముందుకు వెళ్లడమే మేలనే భావనలో టీపీసీసీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు మాత్రమే కోర్టు స్టే విధిస్తే, ఆ స్టేను ఎత్తివేయాలని కోరుతూ పార్టీ పరంగా కూడా అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.