ఖాళీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లు | Sakshi
Sakshi News home page

ఖాళీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లు

Published Tue, Aug 3 2021 1:12 AM

Commissions Play Key Role In Design Of Welfare Programs Are Vacant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రిజర్వేషన్ల అమలులో అన్యాయం.. అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం.. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే కమిషన్లు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగియడం.. వాటిని తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో బడుగు, బలహీన వర్గాల్లో అన్యాయానికి గురైన బాధితుల గోడు వినేవారు కరువయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ–ఎస్టీ కమిషన్‌తోసహా బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్లు ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. చైర్మన్, సభ్యుల పదవీ కాలంముగిసి నెలలు గడుస్తోంది. వాస్తవానికి పదవీ కాలం ముగిసిన వెంటనే నూ తన కమిషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉం డగా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు.  

ఇంతకీ కమిషన్‌ ఏం చేస్తుంది?
జాతీయ స్థాయిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లు చట్టబద్దత కలిగిన సంస్థలు. వీటికి సమాంతరంగా రాష్ట్రాల్లో ఏర్పాటైన కమిషన్లకు విశిష్ట అధికారాలుంటాయి. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, అట్రాసిటీ చట్టం అమలు, సంబంధిత సామాజిక వర్గాల స్థితిగతుల అధ్యయనం, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం, సంక్షేమ పథకాల రూపకల్పనకు సూచనలు తదితర అంశాల్లో రాష్ట్ర కమిషన్లు కీలక భూమిక పోషిస్తాయి. ఇక కులాల విభజన, కేటగిరీల్లో మార్పులు చేర్పులు, రిజర్వేష్లనలో మార్పులపై ప్రతిపాదనలు చేయడం లాంటి అంశాల్లో చురుకుగా ఉంటాయి. కమిషన్‌ను ఆశ్రయించిన వారికి సత్వర సాయం అందించడం, క్షేత్రస్థాయి అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం, వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తే తక్షణ చర్యలు తీసుకునే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. 

ఏడాదిన్నరకు పైగా... 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్‌ను 2016 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు సాగిన ఈ కమిషన్‌ గడువు 2019 అక్టోబర్‌తో పూర్తయింది. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఇక మైనార్టీ కమిషన్‌ను గడువు సైతం ఈ ఏడాది జనవరితో ముగిసింది. ఎస్టీ, ఎస్టీ కమిషన్‌కు ఎక్కువగా అట్రాసిటీకి సంబంధించిన ఫిర్యా దులు వస్తుంటాయి. ఇది వరకున్న కమిషన్‌కు మూడేళ్ల కాలంలో పదివేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రోజు కు సగటున పది ఫిర్యా దులు వచ్చినట్లు చెప్పొచ్చు. ఈ ఫిర్యాదులను యుద్దప్రాతిపదికన పరిశీలించి వేగంగా పరిష్కరం చూపింది. ప్రస్తుతం ఐదు నెలలుగా కమిషన్‌ ఖాళీ కావడంతో ఫిర్యాదులపై గందరగోళంనెలకొంది. తక్షణమే కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాం డ్‌ చేస్తున్నాయి.  

ఆశ్రిత కులాలకు గుర్తింపు దక్కింది
బీసీ సమాజంలో దాదాపు 30 రకాల కులాలకు గుర్తింపు లేదు. అలాంటి కులాలకు మా హయాంలో గుర్తింపు దక్కింది. 30 కులాల నుంచి వినతులు, అభ్యంతరాల స్వీకరణకు ఉపక్రమించాం. కానీ 18 కులాల నుంచి మాత్రమే స్పందన వచ్చింది. పరిశీలన చేసి 17 కులాలకు గుర్తింపు ఇచ్చాం. ఇందులో 14 కులాలను బీసీ–ఏ కేటగిరీలో, 3 కులాలను బీసీ–డీ కేటగిరీలో చేర్చాం. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లపై సుధీర్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కోర్టు పరిధిలో ఈ అంశం పెండింగ్‌లో ఉంది.
– బీఎస్‌ రాములు, రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ 

విప్లవాత్మక మార్పులు తెచ్చాం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విప్లవాత్మక మార్పు లు తెచ్చింది. దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సూచించగా, సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందిం చి నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. ఈఎండీ మినహాయింపుతో రూ.కోటి వరకు పనులు కేటాయిస్తోంది. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో క్రియాశీలంగా పనిచేసింది. మూడేళ్ల కాలంలో అట్రాసిటీతోపాటు అన్ని కేటగిరీల్లో 13,905 వినతులు స్వీకరించి పరిష్కరించాం. రూ.78.30కోట్లు బాధితులకు పరిహారం అందజేశాం.   
 – ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌  

Advertisement
 
Advertisement
 
Advertisement