ప్రజలకు నష్టం చేయం: సీఎం రేవంత్‌ | CM Revanth Says We provide rehabilitation to people of Musi River | Sakshi
Sakshi News home page

ప్రజలకు నష్టం చేయం: సీఎం రేవంత్‌

Mar 24 2026 1:32 AM | Updated on Mar 24 2026 12:13 PM

CM Revanth Says We provide rehabilitation to people of Musi River

మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పిస్తాం: సీఎం రేవంత్‌

మెరుగైన వసతులు ఏర్పాటు చేసి తరలిస్తాం 

ఉసిగొల్పే వాళ్ల ఉచ్చులో పడొద్దు.. పార్టీలు అపోహలు సృష్టించకూడదు 

మీరు సలహాలు ఇస్తే తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం.. 

అందరం కలిసి హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం 

శాసనమండలిలో ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ‘మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవ్వరికీ నష్టం చేయం. నిరాశ్రయులను చేయం. పునరావాసం కల్పిస్తాం. మెరుగైన వసతులు ఏర్పాటు చేసి తరలిస్తాం. ప్రాజెక్టును నిర్మిస్తూనే అక్కడ నష్టపోయే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పిస్తాం. బఫర్‌ జోన్‌లో ఉండే వారికి ఏ రకంగా సహాయం అందించాలో అందిస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పే వాళ్ల ఉచ్చులో పడొద్దు. రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో అపోహలు సృష్టించకూడదు. అందరం కలిసి హైదరాబాద్‌ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, అద్దంకి దయాకర్‌ సోమవారం శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. 

కావాలంటే కేబినెట్‌ కమిటీ వేస్తాం.. 
‘మూసీ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రండి. ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వండి. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పారు. మూసీ నది  వెంట 50 మీటర్ల బఫర్‌ జోన్‌ కూడా మీరు నిర్ణయించిందే. మీరు ప్రారంభించి అర్థాంతరంగా వదిలేసిన పనినే మేం ముందుకు తీసుకెళుతున్నాం. ఈ విషయంలో మీరు ఏ సూచన చేసినా పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజలకు ఉపయోగపడేవి అయితే 100% అమలు చేస్తాం. నాకు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కేబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తాం. ఆ కమిటీకి మీ సూచనలు చెప్పొచ్చు.  

ప్రాణాంతకంగా మూసీ నీళ్లు 
నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలను చూస్తే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోరు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ నగరంలో కాలుష్యం, జంతువుల కళేబరాలు, మనుషుల శవాలతో ఆ నీళ్లు వారికి ప్రాణాంతకంగా మారాయి. ఆ ప్రాంతంలో పండిన పంటలు, బోర్లలో నీళ్లు కూడా పిల్లలపైన విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఆ సమస్యల నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. మూసీలో శుభ్రమైన నీరు ప్రవహించేలా గోదావరి జలాలు తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.  

మూసీ బఫర్‌ జోన్‌ 50 మీటర్లు 
‘గాందీసరోవర్‌ నిర్మించేందుకు 98 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేంద్రం ఇస్తుంది. టూరిజం శాఖ దగ్గర ఇంకో 100 ఎకరాలు ఉన్నాయి. ఆ అపార్ట్‌మెంట్‌ల (మధుపార్క్‌ రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌ల అంశాన్ని ఉద్దేశించి) భూమి తీసుకోకపోయినా పరవాలేదు. కానీ ఆ అపార్ట్‌మెంట్‌లలో ఉండే మిత్రులు 2005–06లో 9 మీటర్ల బఫర్‌ జోన్‌ చూపించి అనుమతులు తీసుకున్నారు. అయితే 2016లో మూసీ బఫర్‌ జోన్‌ 50 మీటర్లు అయ్యింది. ఆ ప్రకారం మార్క్‌ చేస్తే సగం అపార్ట్‌మెంట్‌లు బఫర్‌ జోన్‌లో ఉంటాయి. భవిష్యత్తులో వాటిని అమ్ముకోవడానికి వీలుకాదు. అందువల్ల నష్టం జరుగుతుందని మాత్రమే చెబుతున్నాం. మీకు ఇష్టమైతే, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఆ భూమిని ఇప్పుడు ఇస్తే నష్టపరిహారం ఇస్తాం. ప్రత్యామ్నాయం చూపడానికి కూడా అభ్యంతరం లేదు.  

హైదరాబాద్‌ అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ 
ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయి. నగరంలో వాహనాల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టుగా పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశాం. తెలంగాణ రైజింగ్‌ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌ అని మూడు జోన్లుగా విభజించాం. క్యూర్‌ పరిధిని సేవా రంగంగా, ప్యూర్‌ను తయారీ కేంద్రంగా, రేర్‌ను వ్యవసాయ ప్రాధాన్యతగా అభివృద్ధి చేయబోతున్నాం. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతం (క్యూర్‌)లోని కాలుష్య కారక పరిశ్రమలను బయటకు తరలిస్తేం నగరం నివాస యోగ్యంగా మారుతుంది. అందుకే హిల్ట్‌ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్‌ను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసే క్రమంలో ఒకే విధమైన పరిపాలన విధానం కోసం మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, నాలుగు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేశాం. భవిష్యత్‌ అభివృద్ధి కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను తయారు చేశాం..’అని సీఎం తెలిపారు. 

మెట్రో విస్తరణ..ఎలివేటెడ్‌ కారిడార్లు 
‘ప్రజల సౌకర్యం కోసం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఉన్న సమయంలోనే హైదరాబాద్‌ నగరానికి మెట్రో రైలు సదుపాయం వచ్చింది. ఆనాడు దేశంలో రెండో స్థానంలో ఉన్న మన మెట్రో గత పదేళ్లలో నిర్లక్ష్యంతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెట్రో విస్తరణకు ఎల్‌అండ్‌టీ అనుకూలంగా లేకపోవడంతో మెట్రోను రూ.15 వేల కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటోంది. ఏప్రిల్‌ వరకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ వచ్చేలా మెట్రో రైలును నాగోల్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు, గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట, రాయిదుర్గం నుంచి నియోపోలీస్‌ వరకు మొత్తం 76 కిలోమీటర్లు మార్గాన్ని రూ.24 వేల కోట్లతో నిర్మించేందుకు అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. మెట్రో విస్తరణకు కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. 

హిమాయత్‌సాగర్‌ నుంచి గౌరెల్లి వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ 
ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌కు రేడియల్‌ రోడ్లు వేస్తున్నాం. హిమాయత్‌సాగర్‌ నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీ దగ్గర ఉన్న గౌరెల్లి వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ వేస్తున్నాం. గండిపేట నుంచి గౌరెల్లికి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చేరుకుంటారు. నగరంలో ఉండే వాళ్లు నగరం బయటకు వెళ్లేందుకు వీలుగా నగరం మధ్యలోంచి మూసీ వెంట ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తాం. దీనికి గౌలిగూడ బ్రిడ్జి దగ్గర, చాదర్‌ఘాట్‌ దగ్గర, నాగోల్‌ దగ్గర, అంబర్‌పేట జంక్షన్‌ దగ్గర ట్రంపెట్లు వస్తాయి. ఇలా హైదరాబాద్‌ను అద్భుత రీతిలో అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం..’అని రేవంత్‌ వివరించారు. 

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే కింద రోడ్డు 
‘హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించేందుకు.. రోడ్లను అండర్‌ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్‌ కారిడార్‌ అని మూడు రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు మధ్యలో రన్‌వే కింది నుంచి అండర్‌పాస్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తెచ్చాం. పనులు జరుగుతున్నాయి. దేశంలో ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదు. నల్లగొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్‌ కారిడార్లను జూలై వరకు పూర్తిచేస్తాం. ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాం. ఫుట్‌పాత్‌ వ్యాపారులకు ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి ప్రోత్సహిస్తాం. మల్టీలెవల్‌ పార్కింగ్‌  విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాం..’ అని సీఎం తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement