డిసెంబర్‌లో గ్లోబల్‌ సమ్మిట్‌ | CM Revanth Reddy Says Global Summit in December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో గ్లోబల్‌ సమ్మిట్‌

Jun 4 2026 2:06 AM | Updated on Jun 4 2026 2:06 AM

CM Revanth Reddy Says Global Summit in December

దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ మషాటిలేకు జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి 

సదస్సులో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడికి ఆహ్వానం 

సానుకూలంగా స్పందించిన మషాటిలే  

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య చారిత్రక బంధం ఉందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026 కార్యక్రమాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనాలంటూ దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ మషాటిలేతో పాటు ఆ దేశ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంపై మషాటిలే సానుకూలంగా స్పందించారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో పాల్‌ మషాటిలే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ప్రతినిధుల బృందంతో సీఎం సమావేశమయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య పర్యాటకం, పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో పరస్పర సహకారంపై చర్చించారు.  

గత ఏడాది సమ్మిట్‌తో పెట్టుబడుల వెల్లువ 
గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌ 2025’భారీ విజయాన్ని సాధించిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని సీఎం గుర్తు చేశారు. ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్‌ వంటి రంగాలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే విధంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని చెప్పారు. ఫారŠూచ్యన్‌ 500 కంపెనీలు తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీలు) హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు.  

దక్షిణాఫ్రికాతో కలిసి పనిచేస్తాం 
తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో మధ్యప్రాచ్య, ఇతర అనేక దేశాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని రేవంత్‌ తెలిపారు. నగరాన్ని ప్రపంచ స్థాయి మెడికల్‌ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 30 వేల ఎకరాల్లో పర్యావరణ హితంగా, నెట్‌ జీరో టెక్నాలజీతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, పరిశోధనలకు ఇది కేంద్రంగా మారుతుందని వివరించారు. 

పెట్టుబడులకు అనుకూలం: మంత్రి శ్రీధర్‌బాబు 
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ కలిగిన రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు చెప్పారు. బల్క్‌ డ్రగ్స్, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.  

రెండు దేశాలదీ చారిత్రక బంధం: పాల్‌ మషాటిలే 
వచ్చే డిసెంబర్‌లో జరిగే సమ్మిట్‌–2026కు తమ దేశ ప్రతినిధుల బృందంతో కలిసి పాల్గొంటామని మషాటిలే తెలిపారు. ఈ సదస్సుతో ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య చారిత్రక బంధం ఉందని, దశాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని, భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల ఉప మంత్రి మొరాకాతో పాటు పలువురు మంత్రులు, దక్షిణాఫ్రికాలో భారత రాయబారి ఎ.సూక్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement