100% ధాన్యం కొనాల్సిందే.. పంజాబ్‌లో లాగా కేంద్రమే సేకరణ చేయాలి: సీఎం కేసీఆర్‌

CM KCR Targets Centre On Paddy Procurement - Sakshi

బాయిల్డ్‌ రైస్‌ చేస్తరో, ఇంకేం చేస్తరో మీ ఇష్టం 

మిల్లింగ్‌ కేంద్రమే చేయించుకోవాలి

ధాన్యం కొనకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలి. పంజాబ్, హరియాణాకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం రైతుల హక్కు. కేంద్రం పంజాబ్‌లో ధాన్యం వంద శాతం కొనుగోలు చేసినట్టే.. తెలంగాణలో కూడా కొనాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర ఇస్తున్నది ధాన్యానికే తప్ప బియ్యానికి కాదని.. రైతుల నుంచి ధాన్యం కొన్నాక బాయిల్డ్‌ రైస్‌ చేసుకుంటరో.. బా గోతం ఆడుకుంటరో.. ఇంకేం చేసుకుంటరో కేం ద్రం ఇష్టమని వ్యాఖ్యానించారు. మొత్తం ధాన్యం మాత్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సోమ వారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిశాక కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. 

ప్రస్తుతం 30లక్షల ఎకరాల్లో వరి.. 
‘‘రాష్ట్రంలో గత యాసంగిలో 55 లక్షల ఎకరాల్లో వరి పండింది. ఈసారి 35 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంట్లో 3 లక్షల ఎకరాల్లో విత్తనాల కోసం, మరో రెండున్నర లక్షల ఎకరాల్లో స్వయం వినియోగానికి పంట వేశారు. మిగతా 30 లక్షల ఎకరాల్లో పండిన వరి కొనాల్సి ఉంటుంది. దీనికోసం రేపు (మంగళవారం) వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు, ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లి కేంద్ర ఆహారమంత్రిని కలుస్తారు. వాళ్లు సమ్మతిస్తే సంతోషం. లేకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధం. తెలంగాణలోని అన్ని స్థానిక సంస్థలు, మార్కెట్‌ కమిటీల్లో తీర్మానం చేసి ప్రధానికి పంపిస్తాం. అప్పటికీ ధాన్యం కొనకుంటే తీవ్రంగా ఉద్యమిస్తాం. అవసరమైతే కేబినెట్‌ అంతా వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడతాం. కిసాన్‌ నాయకులు కూడా మద్దతు తెలుపుతామన్నారు. రైతు ఉద్యమాలు నిర్మించాలని టికాయత్‌కు చెప్పాం. వడ్లు తీసుకెళ్లి ఇండియా గేట్‌ దగ్గర పోస్తాం.  

రైతులకు రాజ్యాంగ రక్షణ కావాలి 
దేశంలో రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన అవసరముంది. కనీస మద్ధతు ధర, ధాన్యం సేకరణతోపాటు ఇతర అంశాలపై జాతీయ స్థాయిలో రాజ్యాంగ రక్షణ అవసరం. ఈ మేరకు ప్రధాని, ఆహార మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తాం. రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతాం. ధాన్యం సేకరణకు జాతీయ విధానం ఉండాలని అడుగుతాం. దేశంలో కొందరు వ్యక్తులు బ్యాంకులను కొల్లగొట్టి రూ.11 లక్షల కోట్లు ముంచారు. కానీ రూ.15 వేలకోట్లు వెచ్చించి ధాన్యం సేకరించడం కేంద్రానికి కష్టమవుతోందా?’’అని సీఎం కేసీఆర్‌ నిలదీశారు.  

స్టేట్‌మెంట్లు కాదు.. యాక్షన్‌ 
రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆందోళనలు ఉధృతం చేస్తాం. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తాం. ఈ పోరాటం ఆషామాషీగా ఉండదు. మాటలు, పేపర్‌ స్టేట్‌మెంట్లుగా ఉండదు. యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా ఉంటది. ఈ పోరాటాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తాం. పంజాబ్, హరియాణాల తరహాలో వందశాతం ప్రొక్యూర్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చేవరకు పోరాటం చేస్తాం. వదిలే ప్రశ్నే లేదు.

తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు 
ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు. మేం ఉద్యమ వీరులం. ఉద్యమం చేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరే భంగపడతారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్‌కు అవలంబించిన విధానాన్నే మాకు అమలు చేయండి. మేం కోరేది గొంతెమ్మ కోర్కె కాదు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనండి, మీరే మిల్లింగ్‌ చేయించుకోండి. ఇందుకోసం పూర్తిస్థాయిలో సహకరిస్తాం. దేశ ఆహార భద్రత విషయంలో రాజ్యాంగ బద్ధమైన విధిని కేంద్రం నెరవేర్చాలి. దీని నుంచి తప్పించుకోవద్దు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top