పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR Inagrated Integrated Command Control System At Hyderabad - Sakshi

Telangana Police Integrated Command and Control Centre: హైదరాబాద్‌ నగర సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే తన ఛాంబర్‌లో సీపీ సీవీ ఆనంద్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రారంభోత్సవం  సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను(సీసీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

18వ ఫ్లోర్‌లో సీపీ ఆఫీస్‌
అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, ఒకేచోటా నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మించారు. దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్‌ చేస్తూ.. రూ. 600 కోట్లతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 మీటర్లు. టవర్‌ ఏ లోని 18వ ఫ్లోర్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంది. 14, 15వ ఫ్లోర్‌లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్‌ బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్‌కు కేటాయించారు.
సంబంధిత వార్త:ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్‌ ట్విన్‌ టవర్స్‌ ప్రత్యేకలివే..

ఒకే గొడుకు కిందికి అన్ని విభాగాలు
సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే దిశగా 5 టవర్లు(ఏబీసీడీఈ) ఏర్పాటు చేశారు. బిల్డింగ్‌ చుట్టూ 35 శాతం గ్రీనరీ, 600 వాహనాలు పార్కింగ్‌ చేసుకునేలా ఏర్పాటు చేశారు.  ఫ్లోర్‌ ఫ్లోర్‌కు సోలార్‌ ప్లాంటు  ఉంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలు సీసీసీకి అనుసంధానం చేశారు. నగర వ్యాప్తంగా సీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్‌ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. నగర కమిషనరేట్‌ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ బ్రాంచ్‌.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్‌ విండో విధానం అమలుకానుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top