యాప్‌.. ఏజ్‌ గ్యాప్‌!

Changing App Preferences By Age Group In India - Sakshi

భారత్‌లో వయసుల వారీగా మారుతున్న యాప్‌ల ప్రాధాన్యతలు 

24 ఏళ్లలోపు యువతరం ఇన్‌స్టా, ట్రూకాలర్, ఫ్లిప్‌కార్ట్, ఎంఎక్స్‌ ప్లేయర్, టెలిగ్రామ్‌ల వినియోగం 

25 ఏళ్లుపైన వారు వాట్సాప్, ఫేస్‌బుక్, ఫోన్‌పే, అమెజాన్, ఫేస్‌బుక్‌ మెసెంజర్ల వైపు మొగ్గు 

మహిళలు, పురుషులు ఉపయోగించే యాప్‌లూ వేరే.. 

ఫోన్‌ వాడే సమయంలో 88శాతం యాప్‌లలోనే గడుపుతున్న తీరు  

సాక్షి, హైదరాబాద్‌:  కొందరికి బిర్యానీ ఇష్టం.. ఇంకొందరికి వంకాయ అంటే మధురం.. మరికొందరికి పప్పన్నమే అమృతం.. ఇలా ఇష్టాలు మరెన్నో.. అదీ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల వారీగా భిన్నంగా ఉంటుంది. అందుకే ‘లోకో భిన్న రుచి’అన్న సామెత పుట్టింది. మరి ఒక్క భోజనం విషయంలోనేనా.. అన్ని వ్యవహారాలకూ ఈ నానుడి వర్తిస్తుంది. ఇది తేల్చేందుకే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు, యాప్‌ల వినియోగంపై వివిధ అధ్యయనాలు జరిగాయి. అన్ని అధ్యయనాలూ కొంచెం అటూఇటూగా ఒకే తరహా ఫలితాలను ఇవ్వడం గమనార్హం. అన్నీ కూడా లోకా ‘మొబైల్‌ యాప్స్‌’భిన్న రుచీ అన్నట్టుగా నివేదికలు ఇచ్చేశాయి మరి.. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల మందికిపైగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఉన్నట్టు అంచనా. దీనికి తగ్గట్టుగానే మొబైల్‌ అప్లికేషన్స్‌ (యాప్స్‌) భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫోన్లు, యాప్‌ల వినియోగం బాగా ఎక్కువైంది. ఆఫీసులో, ఇంట్లో, వీధిలో, బెడ్‌పై ఉన్నా, భోజనం చేస్తున్నా, వాహనాల్లో ఉన్నా ఫోన్లను ఉపయోగించడం పెరిగిపోయింది.

అయితే ఇందులో ఫోన్‌ మాట్లాడటానికి వినియోగించే సమయం తక్కువేనని.. 88శాతం సమయాన్ని యాప్స్‌లోనే గడుపుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక తరచూ ఫోన్‌ చెక్‌ చేసుకోవడం కూడా బాగా పెరిగిపోయినట్టు తేలింది. ఉదాహరణకు అమెరికన్లు సగటున రోజూ 262 సార్లు అంటే ప్రతి ఐదున్నర నిమిషాలకోసారి తమ ఫోన్‌ను చెక్‌ చేసుకుంటున్నట్టు వెల్లడైంది.

వివిధ అధ్యయనాలు, పరిశీలనల్లో తేలినది ఇదీ.. 
►24 ఏళ్లలోపు యువతరంలో 21శాతం రోజుకు యాభైకంటే ఎక్కువసార్లు ఒక యాప్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. 
►49 శాతం వినియోగదారులు రోజుకు 11 సార్లు యాప్‌లను తెరుస్తున్నారు. 
►సగటు స్మార్ట్‌ఫోన్‌యూజర్‌ రోజుకు 10 యాప్‌లను.. నెలకు 30 యాప్‌లను ఉపయోగిస్తున్నారు. 
►యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో 1.96 మిలియన్ల యాప్‌లు, గూగుల్‌ ప్లేస్టోర్‌లో 2.87 మిలియన్ల యాప్‌లు ఉన్నాయి. 
►గతేడాది మొత్తంగా 219 బిలియన్ల యాప్‌లను స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 
►ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం యాప్‌ డౌన్‌లోడ్లు ఉచితంగానే జరుగుతున్నాయి. 
►సగటున ఒక్కో వ్యక్తి తమ ఫోన్‌లో 80 దాకా యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నారు. వీటిలో 62 శాతం యాప్‌లను నెలలో ఒకసారి కూడా ఉపయోగించడం లేదు 
►2023లో మొబైల్‌ యాప్స్‌ ద్వారా 935 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ జనరేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌ విషయానికొస్తే.. 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్లకు భిన్నంగా మనదేశంలో వయసు వారీగా యాప్‌ల వినియోగంలో ప్రాధాన్యతలు వేరుగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా 18– 24 ఏళ్ల మధ్యవారు తమ మొబైల్స్‌లో గడిపే సమయం, వినియోగించే యాప్‌లకు.. 25ఏళ్లు, ఆపైనవారి అభిరుచులు, ప్రాధాన్యతలకు భిన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. 
►24 ఏళ్లలోపు యువతరం ఇన్‌స్టా, ట్రూకాలర్, ఫ్లిప్‌కార్ట్, ఎంఎక్స్‌ ప్లేయర్, టెలిగ్రామ్‌లను అధికంగా వినియోగిస్తున్నారు. 
►25 ఏళ్లు, ఆపై వయసు వారు వాట్సాప్, ఫేస్‌బుక్, ఫోన్‌పే, అమెజాన్, ఫేస్‌బుక్‌ మెసెంజర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 
►మహిళలు ఉపయోగించే టాప్‌–5 యాప్‌లలో వాట్సాప్, స్నాప్‌చాట్, మీషో, షేర్‌చాట్, మోజో ఉన్నాయి. 
►పురుషులు ఎక్కువగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్రూకాలర్, ఫోన్‌పే, అమెజాన్‌లను వినియోగిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top