వన వీరులను స్మరిస్తూ..  | Sakshi
Sakshi News home page

వన వీరులను స్మరిస్తూ.. 

Published Fri, Nov 12 2021 3:43 AM

Centre Govt Declares Birsa Jayanti as Janjatiya Gaurav Divas - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బ్రిటిష్‌ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు, బెంగాల్‌ ప్రెసిడెన్సీ (ప్రస్తుత జార్ఖండ్‌) ప్రాంతానికి చెందిన బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్‌ 15ను జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక నుంచి గిరిజనుల విజయాలు, సంస్కృతిని స్మరించుకుంటూ ఏటా నవంబర్‌ 15 నుంచి వారం రోజులపాటు వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు.

ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం నిర్ణయించగా, అఖిల భారత వనవాసి కల్యాణ పరిషత్‌ తెలంగాణ శాఖ ఇదివరకే ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జనజాతి గౌరవ దినోత్సవం నిర్వహించాలని తలపెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం రావడం, మరోపక్క వనవాసి కల్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో బిర్సాముండా జయంతి రోజే ఇంద్రవెల్లిలో వనవీరులను స్మరిస్తూ బహిరంగ సభ తలపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నిర్వాహకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఆహ్వానించారు. విశిష్ట అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఆత్మీయ అతిథిగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపురావు పాల్గొననున్నారు.  

జాతీయ నాయకుడిగా బిర్సాముండాకు గుర్తింపు 
గిరిజన యోధుడు బిర్సాముండాను జాతీయ నాయకుడిగా ప్రభుత్వం గుర్తించింది. ఎస్టీలకు ఇది గర్వకారణం. జయంతి దినోత్సవాన్ని జాతీయ గౌరవ్‌ దివస్‌గా ప్రకటించినందుకు ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు.
– సోయం బాపురావు, ఆదిలాబాద్‌ ఎంపీ 

Advertisement

తప్పక చదవండి

Advertisement