ఆర్టీసీ డొక్కు బస్సులు ఇక తుక్కే!

Central Govt Order To Remove 15 Years Old TSRTC Buses - Sakshi

15ఏళ్లు దాటిన వాహనాలను తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో కదలిక 

700 వరకు బస్సులు తగ్గిపోతాయని అంచనా 

వాటి స్థానంలో నడిపేందుకు కొత్త బస్సుల కోసం టెండర్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో 15 ఏళ్లకుపైగా నడుస్తున్న డొక్కు బస్సులు ఇక కనిపించవు. 15ఏళ్ల కాలం తీరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలన్నింటినీ వచ్చే ఏప్రిల్‌ నాటికి తుక్కుగా మార్చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ బస్సులను తొలగించబోతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఏర్పాట్లు ప్రారంభించింది. సంస్థలో 15 ఏళ్లు దాటిన బస్సుల జాబితా సిద్ధం చేస్తోంది.

సుమారు 700కుపైగా బస్సులను తొలగించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే 670 కొత్త బస్సుల కోసం ఆర్టీసీ ఇటీవల టెండర్లు పిలిచింది. ఈ నెలాఖరు నుంచి మార్చి వరకు దశలవారీగా కొత్త బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. బస్సులు తగ్గితే ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ముందుజాగ్రత్తగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

కొన్నేళ్లుగా అవే ఆధారం 
ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను వెంటనే తుక్కుగా మార్చే విధానం గతంలో ఉండేది. కానీ గత పదేళ్లలో పరిస్థితి మారింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ ఇబ్బంది పడుతోంది. 2015లో ఒకదఫా మినహా పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు సమకూర్చుకోలేకపోయింది. ఆర్టీసీలో ఏటా 200కుపైగా పాత బస్సులు తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి.

కానీ కొత్త బస్సుల కొనుగోలు దాదాపు నిలిచిపోవటంతో పాత బస్సులనే రిపేర్లు చేసుకుంటూ నడుపుతోంది. నిజానికి 2019 నాటి ఆర్టీసీ సమ్మె సమయంలో హైదరాబాద్‌ నగరంలో వెయ్యి బస్సులు తగ్గించాలని సీఎం ఆదేశించారు. అన్ని బస్సులు తగ్గిస్తే ప్రయాణికులకు ఇబ్బందని భావించిన అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా బాగా పాతబడ్డ బస్సులను తుక్కుగా చేసి, వాటినే తొలగించిన వెయ్యి బస్సులుగా చూపారు. అలా ఒకేసారి పెద్ద మొత్తంలో 15 ఏళ్లు పైబడిన బస్సులు తగ్గిపోయాయి. లేకుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 1,700 వరకు ఉండేదని అంటున్నారు. 

కన్వర్షన్‌ పేరుతో.. 
ఆర్టీసీకి లాభసాటి కేటగిరీ బస్సులు సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌లే. ఆరున్నర లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన బస్సులను తదుపరి తక్కువ కేటగిరీ బస్సులుగా మార్చే పద్ధతి ఆర్టీసీలో ఉంది. ఎక్కువ దూరం తిరిగిన సూపర్‌ లగ్జరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌లుగా, ఎక్స్‌ప్రెస్‌లను పల్లె వెలుగు బస్సులుగా, మరీ ఎక్కువ తిరిగిన బస్సులను హైదరాబాద్‌ సిటీ బస్సులుగా మారుస్తున్నారు. ఇలా మార్చినవాటిలో కొన్నింటికి ఏకంగా మరో పదేళ్లు తిప్పుతున్నారు.

కానీ వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే పాత వాహనాలను కూడా కేంద్ర ఆదేశం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త వాహనాలు సమకూరాయి. చాలా వరకు పాతవాటిని పక్కనపెట్టేశారు. దీనితో తొలగించాల్సినవి నామమాత్రం­గానే ఉంటాయని..అయితే పోలీసుశాఖ పరిధి­లో వాడే వ్యాన్లు, బస్సులు, పాత జీపుల్లో కొన్నింటిని తొలగించాల్సి ఉంటుందని అంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top