
16న రెండు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న కేంద్రమంత్రి సీఆర్ పాటిల్
చర్చించాల్సిన అంశాలతో తక్షణమే ఎజెండా పంపాలని లేఖ
రాష్ట్ర వాటాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 16న మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసినట్లు.. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ భేటీలో చర్చించడానికి రెండు రాష్ట్రాలూ తమ ఎజెండా అంశాలను తక్షణమే పంపించాలని కోరారు. సీఎంలతో పాటు సమావేశానికి రానున్న ప్రతినిధి బృందాల వివరాలను కూడా పంపించాలని సూచించారు.
తెలంగాణ వాటాల కోసం కేంద్రంపై ఒత్తిడి
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణా బేసిన్‌లోని రాష్ట్ర ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్సు ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు. 16న ఢిల్లీలో జరిగే సమావేశంలో రాష్ట్ర నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ‘కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటి వాటాల సాధించడంలో దారుణంగా విఫలమైంది. తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడింది. కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది..’ అని సీఎం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.