
కాంగ్రెస్ హడావుడి
బీజేపీ..గప్‌చుప్
జూబ్లీహిల్స్‌లో పార్టీల తీరు ఇలా...
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మొదటి రోజైన సోమవారం ప్రధాన రాజకీయపారీ్టలేవీ నామినేషన్లు దాఖలు చేయలేదు. పోలింగ్‌కు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ ప్రచారాల్లో మునిగాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. దీంతో, తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టకోవడమే కాక, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పేందుకు ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే తలంపులో బీఆర్‌ఎస్ ఉంది.
గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే తమ అభ్యర్థిగా అందరి కంటే ముందే ప్రకటించిన బీఆర్‌ఎస్, ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించగా, తాజాగా సోమవారం రహ్మత్‌నగర్‌లో పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలుపు ఇప్పటికే ఖాయమైందని, ఎక్కువ మెజార్టీ పొందడమే ముందున్న లక్ష్యమని కార్యకర్తలను ప్రోత్సహించారు. అనంతరం కేటీఆర్, అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో భారీ యెత్తున దొంగ ఓట్లు చేర్చిందంటూ ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఓవైపు పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. మరోవైపు బస్తీల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ నియోజకవర్గాల్లోని వారి సహకారం కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి తదితరులను కలిసి ఎన్నికలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవడంతో బహిరంగంగా ప్రచార కార్యక్రమాలేవీ లేనప్పటికీ, లోపాయికారీగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల తొలిరోజు దృశ్యాలిలా ఉండగా, మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశాక ప్రచార కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి.