Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!

Bhupalapalli: Mating Season for Tigers Begin - Sakshi

ఉమ్మడి జిల్లాకు వచ్చింది ఏడేళ్ల మగపులి ఎస్‌–8

26 రోజులుగా ఐదు జిల్లాల అడవుల్లో పులి వెతుకులాట

తోడు దొరకకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు

నవంబర్‌ 7న భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర ప్రవేశం..

గురువారం వెంకటాపురం (ఎం) అడవులు దాటిన వైనం

ప్రాణహిత, గోదావరి, కిన్నెరసాని నదుల వెంట ప్రయాణాన్ని సాగించిన మగ పులి ఆడతోడు కోసమే ఇటువైపుగా వచ్చినట్లు తెలుస్తోంది. 26 రోజులపాటు సాగిన ప్రయాణంలో తోడు దొరకకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు వెళ్తున్నట్లు దాని గమనం చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ పులి సిర్పూర్‌ ప్రాంతానికి చెందినదని, పేరు ఎస్‌–8 అని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మగపులి ఉమ్మడి జిల్లాలో సాగించిన ప్రయాణం.. దాని ప్రత్యేకతలు, ఎందుకు.. ఎలా వచ్చిందన్న దానిపై ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌ కథనం..
– పోతరాజు రవిభాస్కర్, భూపాలపల్లి

మహారాష్ట్రలోని తాడోబా రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పుట్టిన ఈ మగపులి ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిదేళ్లు ఉంటుంది. రెండేళ్ల వయసులో తల్లినుంచి దూరమై అక్కడినుంచి కుమురం భీం జిల్లాలోని సిర్పూర్‌ ప్రాంతానికి వచ్చింది. అక్కడి అటవీశాఖ అధికారులు దీనిని గుర్తించి ఎస్‌–8గా నామకరణం చేశారు. పులులు అభయారణ్యంలో సుమారు 25 నుంచి 30 చదరపు కిలోమీటర్లు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ తాను ఉన్న విషయాన్ని గుర్తించేలా ఆ ప్రాంతం చుట్టూ మలం, మూత్రం విసర్జిస్తుంది. మూత్రం ఎక్కువ కాలంపాటు రసాయనాల మాదిరిగా వాసన వస్తుంది. దీంతో అటువైపు ఇతర జంతువులు, పులులు రావు. కొన్ని సందర్భాల్లో బలమైన పులి వెళ్లి దాడికి పాల్పడినప్పుడు, అక్కడి పులి తన తోడును వదిలి దూరంగా వచ్చేస్తుంది. ఈ మాదిరిగానే ఎస్‌–8 పులి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. 

మేటింగ్‌ సీజన్‌ కావడంతో...
పులులకు చలికాలంలో నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు మేటింగ్‌(సంభోగం) సీజన్‌.. దీంతో సిర్పూర్‌ నుంచి బయలుదేరిన ఎస్‌–8 మేటింగ్‌ చేసేందుకు ఆడపులిని వెతుక్కుంటూ వచ్చింది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల అడవుల్లో తిరిగింది. ఆడతోడు కానరాకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు బయలుదేరింది. 

ఎస్‌–8గా ఎలా గుర్తించారంటే.. 
సాధారణంగా పాదముద్రలు(పగ్‌మార్క్స్‌) ఆధారంగా పులిని గుర్తించి ఆడదా, మగదా అని నిర్ధారిస్తారు. పులుల చర్మంపై చారలు వేర్వేరుగా ఉంటాయి. ఒక పులి చారలను మరో పులి పోలి ఉండదు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పులిని మొదటిసారి గుర్తించిన చోటే దానికి నామకరణం చేస్తారు. 2020, అక్టోబర్‌ 11న సిర్పూర్‌ అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కిన, ములుగు జిల్లా మంగపేట అడవిలో గత నెలలో సీసీ కెమెరాకు చిక్కిన పులి చారలు ఒకే మాదిరిగా ఉన్నాయి. దీంతో అది సిర్పూర్‌ నుంచి వచ్చిన ఎస్‌–8గా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించుకున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడా మనుషులపై దాడి చేసిన ఘటన లేకపోవడంతో మ్యాన్‌ఈటర్‌ కాదని అటవీశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. 

గత ఏడాది నవంబర్‌లో కూడా ఒక పులి భూపాలపల్లి మీదుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగి తోడు దొరకకపోవడంతో మళ్లీ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మీదుగా సిర్పూర్‌ అడవులకు తిరిగి వెళ్లింది. అయితే గతంలో ఆ పులి ఎక్కడా కనిపించలేదు. దీంతో దానికి ఎం(ములుగు)–1గా నామకరణం చేశారు. 

►గురువారం రాత్రి భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. భూపాలపల్లి జిల్లాలోని అడవుల మీదుగా కాళేశ్వరం గోదావరి వరకు వెళ్లి, నది దాటి తిరిగి సిర్పూర్‌ వైపునకు వెళ్లనున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

►30న ములుగు అడవుల్లోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన రాత్రి ములుగు మండలం ఇంచర్ల గ్రామ సమీపంలో గల ఎన్‌హెచ్‌ 163 రహదారి దాటింది. తాజాగా గురువారం వెంకటాపూరం(ఎం) మండలం రామకృష్ణాపూర్‌ అడవిలో పులి అడుగులను గుర్తించారు. 

►29వ తేదీన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటమీదుగా పాకాలకు చేరుకుంది. కొత్తగూడ వెళ్లే దారిలో రోడ్డుదాటుతుండగా ఇద్దరు వాహనదారులు గమనించి భయంతో పరిగెత్తారు. పులి ఆ రోజు మొత్తం ప్రయాణం సాగించింది. 

►ఎస్‌–8 పులి సిర్పూర్‌ నుంచి అక్టోబర్‌ చివరి వారంలో బయలుదేరి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని సిరొంచకు చేరుకుంది. అదే నెల 28వ తేదీన మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా పరిధిలోని పెంటిపాక గ్రామ సమీప అడవిలో పశువుల కాపరి దుర్గం మల్లయ్య(48)పై దాడి చేసి చంపింది. సుమారు వారం రోజులు అదే ప్రాంతంలో ఉంది. 

►25వ తేదీన మహబూబాబాద్‌ జిల్లాకు చేరుకొని గూడూరు మండలం నేలవంచ సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. అనంతరం మూడు రోజులు అక్కడే ఉంది. 

►12వ తేదీన మంగపేట నుంచి నర్సింహాపూర్‌ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి చేరుకుంది. అక్కడ పినపాక మండలం అమరారం సమీప అడవిలో పశువుల మందపై దాడి చేసి ఒక ఆవుని చంపింది. ఆజిల్లా అడవుల్లో సుమారు 12 రోజులు గడిపింది. 

►8వ తేదీ రాత్రి ములుగు జిల్లాలోకి ప్రవేశించింది. రెండు రోజులపాటు ప్రయాణం చేస్తూ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి, కామారం మీదుగా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామం చింతలమోరి వద్ద గల రోడ్‌ను క్రాస్‌ చేసి హీరాపూర్, తొండ్యాల లక్ష్మీపురం మీదుగా మంగపేట మండలంలోకి 11వ తేదీన చేరింది.

►గత నెల 7న గోదావరి నది దాటి కాళేశ్వరం, పలిమెల మీదుగా భూపాలపల్లి మండలంలోని దూదేకులపల్లి శివారు అడవిలో గల మద్దిమడుగుకు 8వ తేదీన చేరుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top