స్వచ్ఛంద వలంటీర్లకు ఆహ్వానం
ఈనెల 22 వరకు నమోదుకు గడువు
వచ్చేనెల 17–23 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత పులుల లెక్కింపు–2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వలంటీర్ల నుంచి రాష్ట్ర అటవీశాఖ దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుల నమోదును మంగళవారం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగనుంది. వచ్చే ఏడాది జనవరి 17–23 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా అటవీ బీట్లలో దీనిని చేపట్టేందుకు.. ఈ రంగంలో కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు, సామాన్యులకు వలంటీర్లుగా అవకాశం కల్పించనున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి మానిటరింగ్ ప్రోగ్రామ్‌గా పేరుగాంచిన ఈ లెక్కింపును (అఖిల భారత పులుల లెక్కింపు) డెహ్రాడూన్ వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు https://tinyurl. com/ aite2026tg లో సైనప్ చేయడంతోపాటు ఏవైనా ప్రశ్నలుంటే 18004255364 నంబర్‌కు, వాట్సాప్‌లో 9803338666 లేదా ఈ–మెయిల్ aite2026tg@gmail.com ద్వారా సంప్రదించవచ్చునని పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఏలూసింగ్ మేరు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో సుమారు 26వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల 3వేలకు పైగా బీట్ల నుంచి సమాచారం సేకరించనున్నట్టు తెలిపారు.
పులుల లెక్కింపు ఇలా..
ప్రతి వలంటీర్ అటవీ సిబ్బందితో కలిసి 7 రోజులపాటు అడవిలో నడుస్తారు. రోజుకు 10–15 కిలోమీటర్ల దూరం నడుస్తూ అడవుల్లో పులుల జాడలు, అడుగుల ముద్రలు, మల చిహా్నలు, నివాస నాణ్యత వంటి వివరాలను సేకరిస్తారు.
వలంటీర్ల అర్హతలు
వయసు: 18–60 ఏళ్లు
శారీరక సామర్థ్యం: రోజుకు 10–12 కిలోమీటర్ల వరకు అడవుల్లో నడిచే సామర్థ్యం
అనుకూలత: తక్కువ సౌకర్యాలతో దూరప్రాంత క్యాంపుల్లో ఉండగల సామర్థ్యం
ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం. ఎలాంటి పారితోషికం ఇవ్వరు. వసతి, ఫీల్డ్ రవాణా సదుపాయం అటవీ శాఖ కల్పిస్తుంది.


