వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో రూ. 25 లక్షలు టోకరా 

Bank One Time Settlement Loan Reduce Fraud In Hyderabad - Sakshi

పంజగుట్ట: వన్‌టైం సెటిల్‌మెంట్‌లో బ్యాంకు రుణాన్ని తక్కువ చేయిస్తానని నమ్మించి రూ. 25 లక్షలు తీసుకుని పరారైన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీకి చెందిన వి.రవికుమార్, తన సోదరుడు రాఘవేందర్‌ డైరెక్టర్లుగా మరికొందరితో కలిసి పంజగుట్టలో రామకృష్ణా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. సంస్థ విస్తరణ నిమిత్తం అప్పటి ఆంధ్రాబ్యాంకు, ప్రస్తుత యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2019లో రూ.81 కోట్లు రుణంగా తీసుకున్నారు.

ఆ తర్వాత కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం జరక్క కిస్తీలు కట్టలేకపోయారు. దీంతో బ్యాంకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సూచించడంతో రూ. 7 కోట్లు చెల్లించారు. 2021 సెప్టెంబర్‌లో నగరానికి చెందిన పి.విక్రమ్‌ అనే వ్యక్తి రవికుమార్‌ సోదరులను కలిశాడు. బ్యాంకు లైజనింగ్‌ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న అతను మీరు తీసుకున్న రుణానికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద  సగం తగ్గిస్తానని చెప్పాడు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ రూ.47 కోట్లకు ఒప్పందం కుదిరిందని బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ పేరుతో నకిలీ లెటర్‌ సృష్టించి వారికి ఇచ్చాడు.

మొదట రూ.25 లక్షలు బ్యాంకుకు ముందస్తుగా చెల్లించాలని తీసుకున్నాడు. ఆ తర్వాత రవికుమార్‌ బ్యాంకు జీఎం పేరుతో ఉన్న లేఖను తీసుకుని బ్యాంకుకు వెళ్లగా అది నకిలీదిగా తేలింది. విక్రమ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్రమ్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసి అతనికోసం గాలింపు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top