పాడికి చేయూత | Sakshi
Sakshi News home page

పాడికి చేయూత

Published Thu, Aug 13 2020 11:14 AM

Bank Loans Approved For Dairy industry in Khammam - Sakshi

పాల్వంచరూరల్‌: కరోనా సంక్షోభం నుంచి పాడి పరిశ్రమను ఆదుకునేందుకే పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం అత్మ నిర్భర్‌ భారత్‌ పథకం ద్వారా రుణాలు అందిస్తోంది. ఈ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 2,308 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో రైతుకు రూ.1.60 లక్షల చొప్పున రుణాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న విజయ డెయిరీలో పాలు పోసే రైతులు మాత్రమే ఈ రుణాలకు అర్హులు. లబ్ధిదారులకు రుణాలు అందేలా పశుసంవర్థక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం అందిన రైతులు మేలు జాతి పశువుల కొనుగోలుతో పాటు దాణా, గడ్డి కోత యంత్రం తదితర అవసరాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు మంజూరు చేసే అధికారం బ్యాంకర్లకు ఉంది. ఈ రుణాలు ఏడాది లోపు చెల్లిస్తే మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే వడ్డీ పడుతుందని, ఆలస్యం అయితే 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు.

మండలాల వారీగా దరఖాస్తులిలా.. 
పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం జిల్లాలోని ఆయా మండలాల నుంచి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దమ్మపేట మండలం నుంచి 341, దుమ్ముగూడెం నుంచి 16 మంది, గుండాల నుంచి 15, సుజాతనగర్‌ నుంచి 558, జూలూరుపాడు నుంచి 52, మణుగూరు నుంచి 13, ములకలపల్లి నుంచి 255, పాల్వంచ నుంచి 88, టేకులపల్లి నుంచి 3, ఇల్లెందు నుంచి 75, అన్నపురెడ్డిపల్లి నుంచి 312, చండ్రుగొండ నుంచి 25, చుంచుపల్లి నుంచి 85, అశ్వాపురం నుంచి 103, భద్రాచలం నుంచి 29, బూర్గంపాడు మండలం నుంచి 306 మంది, అశ్వారావుపేట నుంచి 32 మంది, దరఖాస్తు చేసుకున్నారు. 

ఏ బ్యాంకులో ఎంత మందికి..
పాడి రైతులకు ఇచ్చే రుణాల టార్గెట్‌ను బ్యాంకుల వారీగా విభజించారు. ఇందులో ఎస్‌బీఐ 864 మందికి, ఏపీజీవీబీ 716, యూనియన్‌ బ్యాంక్‌  349, విజయబ్యాంక్‌ 219, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 14, డీసీసీ బ్యాంకు 130, సిండికేట్‌ బ్యాంకు 6, భద్రాద్రి బ్యాంక్‌ 3, ఐఓబీ 3, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా1, హెచ్‌డీఎఫ్‌సీ 1, ఐఓఎస్‌ బ్యాంక్‌ 1, కొటక్‌ బ్యాంకు ఒకరికి.. మొత్తం 2308 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. 

పాడి రైతులు ఆర్థిక ప్రగతి సాధించవచ్చు
పాడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించింది. రుణాలు పొందిన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. జిల్లాలోని 13 బ్యాంకుల ద్వారా 2308 మంది లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేలా టార్గెట్‌ విధించారు. మండలానికి 1000 మందిని ఎంపిక చేయాలని మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే జిల్లాలో బ్యాంకర్లు అందుకు అంగీకరించడం లేదు. – డాక్టర్‌ వేణుగోపాల్‌రావు, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి 

Advertisement
Advertisement