సాక్షి, హుజురాబాద్: బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
అయితే ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆదాడిలో ఆయన సురక్షితంగా బయటపడగా వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్‌రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
అసలు గొడవ ఎందుకు..?
కరీంనగర్‌లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించాయి.


