
ఏపీకి చెందిన ఏజెంట్ చేతిలో మోసపోయిన బాధితురాలు
వెట్టిచాకిరీ, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టు సెల్ఫీ వీడియోలో వెల్లడి
మస్కట్‌లో అశ్వారావుపేట యువతి కష్టాలు
అశ్వారావుపేట రూరల్: ఆర్థిక సమస్యలతో మస్కట్‌కు వెళ్లిన ఓ యువతి అక్కడ ఇబ్బంది పడుతున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన కావ్య డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలానికి చెందిన ఓ మహిళతో కావ్యకు పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో తన ఆర్థిక ఇబ్బందులు, తల్లి మేరీ అనారోగ్య సమస్యల గురించి ఆ మహిళకు చెప్పగా.. మస్కట్‌లో తనకు తెలిసిన ఓ సేఠ్ ఇంటికి పంపిస్తానని, భార్యాభర్తలు మాత్రమే ఉండే వారి ఇంట్లో పని చేస్తే నెలకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు వస్తాయని ఆశ కల్పించింది. మస్కట్‌కు వెళ్లేందుకు రూ.3 లక్షలు ఖర్చవుతాయని, అవి తానే భరిస్తానని చెప్పింది. దీంతో మూడు నెలల క్రితం కావ్య మస్కట్‌కు వెళ్లింది.
కామెర్లు, అనారోగ్య సమస్యలు..
మస్కట్‌లో తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, ఒక ఇంట్లో అని చెప్పి మూడు అంతస్తుల్లో ఏడు కుటుంబాల వారు పని చేయించుకుంటున్నారని, అంతా కలిపి రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారని రోదిస్తూ కావ్య సెల్ఫీ వీడియోను తన తల్లికి పంపించింది. ప్రస్తుతం తాను కామెర్లతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, కనీసం వైద్యం కూడా చేయించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను అశ్వారావుపేటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులు, ప్రభుత్వాన్ని వేడుకుంది. తనను మోసం చేసిన ఏపీకి చెందిన మహిళా ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, తన కూతురును మోసం చేసి మస్కట్‌కు పంపించిన మహిళా ఏజెంట్‌పై ఏపీలోని తాళ్లపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కావ్య తల్లి వెల్లడించారు. తన కూతురును త్వరగా ఇంటికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.