అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నేడే

APEX Council Meeting Today - Sakshi

కేంద్ర మంత్రి షెకావత్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌.. పాల్గొననున్న కేసీఆర్, జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌ల పరిధిలో నెలకొన్న జల వివాదాలపై చర్చించేం దుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంట లకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ సమా వేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్, రెండు బేసిన్‌లలో నీటి వినియోగం, కృష్ణా బోర్డు ఏపీకి తరలింపు వంటి అంశాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ చర్చించనుంది. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పూర్తిస్థాయి నివేదికలతో సిద్ధమైంది.

ముఖ్యంగా నీటి వినియోగంపై ట్రిబ్యునల్‌ అవా ర్డులు, వాటిపై కుదిరిన ఒప్పందాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులిచ్చిన ప్రాజెక్టుల జీవోలు, వాటి రీ ఇంజనీరింగ్‌ అంశాలతో నివేది కలు సిద్ధం చేసుకుంది. కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ వంటి ప్రాజెక్టులు పాతవేనని చెప్పేందుకు అవసరమైన రుజువులు, వాటికి ఉన్న నీటి కేటాయింపుల వివరాలతో రెడీ అయింది. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాల్వ వ్యవస్థల విస్తరణపై తమ అభ్యంతరాలు, తెలంగాణకు జరిగే నష్టంపై సోమవారం సైతం సీఎం కేసీఆర్‌ ఇంజనీర్లతో చర్చించారు. ఈ అంశంపై బలంగా వాదనలు వినిపించేలా వ్యూహం సిద్ధం చేశారు. నీటి వాటాల విషయంలో, టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, ఏపీ కొత్త ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కృష్ణా బోర్డు వైఫల్యాలను ఈ సమావేశంలో సీఎం ఎండగట్టనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top