నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు.. తెలంగాణలో సీఎం అవుతానా? | AP Deputy CM Pawan Kalyan press conference at hyderabad | Sakshi
Sakshi News home page

నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు.. తెలంగాణలో సీఎం అవుతానా?

Jun 3 2026 4:25 AM | Updated on Jun 3 2026 4:26 AM

AP Deputy CM Pawan Kalyan press conference at hyderabad

నన్ను బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ

తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన నిలబడుతుంది 

2029 ఎన్నికల్లో బీజేపీ మాతో కలిసివస్తుందో లేదో తెలియదు  

కొండగట్టు అంజన్నకు రూ.30 కోట్లు ఇచ్చా 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

బంజారాహిల్స్‌: ‘నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు.. తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా?’అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘ఇది భారతదేశం అనుకున్నారా? పాకిస్తాన్, పాలస్తీనా అనుకున్నారా?.. నన్ను బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ. జనసేన ప్రయాణం తెలంగాణలోనే మొదలైంది. ఇక్కడ కూడా జనసేన ఉంటుంది’అని చెప్పుకొచ్చారు. 

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన సైనికుల తరఫున తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విభజనకు తాను వ్యతిరేకం కాదని, విభజన తీరుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. తాను నిజంగా చెరువు కబ్జా చేసి ఉంటే తనను ఉండనిస్తారా? అని అన్నారు. తాను కబ్జా చేశానని నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పారు. గద్దర్‌కు బుల్లెట్‌లు దిగినప్పుడు తన దగ్గరికి వచ్చి అండగా నిలబడమన్నారని చెప్పారు. 

గద్దర్‌ చనిపోయేదాకా ఆయనకు ఏంకావాలో అడిగేవాడినన్నారు. ‘ఆపదలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి నేను డబ్బులు ఇవ్వలేదా? వరదలు వచ్చినప్పుడు రూ.కోటి ఇచ్చా. కొండగట్టు అంజన్నకు రూ.30 కోట్లు ఇచ్చా. నేను తప్పు చేస్తే నా ఆస్తులు సీజ్‌ చేయండి’అని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు తమ నాలుకలు కోస్తామని చెబుతున్నారు.. రండి నాలుకలు చూపిస్తామని ఎద్దేవా చేశారు.   

అసెంబ్లీలో తీర్మానం పెట్టండి... 
‘నా పీక కోసినా నేను భయపడను. దమ్ముంటే తెలంగాణకు పవన్‌ కల్యాణ్‌ రాకూడదంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టండి. తెలంగాణలో జనసేన ఉంటుంది. ఎన్నికల బరిలో నిలుస్తుంది. నేనే స్వయంగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తా. ఇది నా దేశం. నేను ఎక్కడైనా అడుగుపెడతా. పక్క రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకుని పోవాలా?’అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. తనపై విమర్శల వెనుక రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ ఉన్నారని తాను అనుకోవడం లేదన్నారు. పెచ్చుమీరుతున్న ప్రాంతీయవాదంపై కేంద్రం దృష్టిపెట్టాలని చెప్పారు. 

2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, బీజేపీ తమతో కలిసివస్తుందో లేదో తెలియదన్నారు. ‘తెలంగాణలో కొందరు అనలిస్టులు నా వ్యాఖ్యలు వక్రీకరించారు. అమిత్‌ షా గురించి నేను మాట్లాడితే... దానిలో ప్రాంతీయత ఎక్కడుంది? నా గురించి మాట్లాడితే నేను నోరు మెదపవద్దా’అని పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా ప్రొ. నాగేశ్వర్‌ వివాదం గురించి స్పందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement