మావోలకు ‘డెడ్‌’లైన్‌.. మరో పది రోజులే! | Amit Shah has already announced that the country will be Maoist free by March 31st | Sakshi
Sakshi News home page

మావోలకు ‘డెడ్‌’లైన్‌.. మరో పది రోజులే!

Mar 22 2026 5:20 AM | Updated on Mar 22 2026 5:20 AM

Amit Shah has already announced that the country will be Maoist free by March 31st

మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని ఇప్పటికే అమిత్‌షా ప్రకటన 

డెడ్‌లైన్‌ పొడిగింపు ఉండబోదని పలుమార్లు స్పష్టీకరణ 

ఇప్పటికే తెలంగాణలో కీలక మావోయిస్టు నేతల లొంగుబాటు 

తెలంగాణ నుంచి మిగిలిన మరో ఏడుగురిలో మావోయిస్టు అగ్రనేత గణపతి 

గణపతి లొంగుబాటుపై ఇప్పటికే తీవ్ర చర్చ.. మరోవైపు మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌  

స్పందించని కేంద్ర ప్రభుత్వం.. లొంగిపోని వారిపట్ల కఠిన వైఖరేనని హెచ్చరికలు 

అజ్ఞాతంలో ఇంకా వందలాదిమంది మావోయిస్టులున్నారంటున్న లొంగిపోయిన ఓ కేంద్ర కమిటీ సభ్యుడు

సాక్షి, హైదరాబాద్‌: ‘మార్చి 31 నాటికి భారత దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం’గత రెండేళ్లుగా పలు వేదికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేస్తున్న ప్రకటన ఇది. తాజాగా ఈ నెల 6న ఒడిశాలోని కటక్‌ జిల్లా ముందలిలో జరిగిన సీఐఎస్‌ఎఫ్‌ 57వ ఆవిర్భావ దినోత్సవంలోనూ ‘తిరుపతి నుంచి నేపాల్‌లోని పశుపతినాథ్‌ వరకు రెడ్‌ కారిడార్‌ నిర్మించాలని కలలు కనే శక్తులను మన భద్రత దళాలు కచ్చితంగా ఓడిస్తాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో నక్సలిజం అంతం కావడమే లక్ష్యం’అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

మార్చి 31 లోపు అజ్ఞాతం వీడి లొంగిపోని మావోయిస్టుల పట్ల కఠిన వైఖరే అని కూడా అమిత్‌ షా సుస్పష్టంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం..ఈనెల 31న మావోయిస్టులకు ‘డెడ్‌’లైన్‌ పూర్తవుతుంది, మరో పదిరోజులే గడువు ఉంది, అయితే ప్రభుత్వాలు చెబుతున్నట్టు మార్చి 31 తర్వాత మావోయిస్టులు లేని భారత్‌ సాధ్యమేనా..? 

మరోవైపు పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు చెబుతున్నట్లుగా డెడ్‌లైన్‌లు పెట్టి సిద్ధాంతాలు అంతం చేయలేరన్న వాదనలు గెలుస్తాయా..? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఇంకా మావోయిస్టులలో వందలాది మంది సాయుధులు ఉన్నారని, మావోయిస్టులను అంతం చేయడం ప్రభుత్వాలు అనుకున్నంత సులువేంకాదని ఇటీవల జనజీవనస్రవంతిలోకి వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు ధీమా వ్యక్తం చేశారు.  

ఆ ఏడుగురు తిరిగొచ్చేనా...?
మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 2023లో 125 మంది ఉండగా..ప్రస్తుతం ఆ సంఖ్య ఏడుకు పరిమితమైందని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యులు దేవ్‌జీ అలియాస్‌ టిపిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్, చంద్రన్న సహా ఎంతో మంది కీలక నేతలు నెలల వ్యవధిలోనే లొంగుబాట పట్టారు. అయితే తాము అరెస్టు అయ్యామని చెబుతున్నా..పోలీసులు సరెండర్‌ చూపినా..ఫలితం మాత్రం ఆయుధాన్ని వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చారు. 2024 నుంచి తెలంగాణ పోలీసుల ఎదుట 721 మంది లొంగిపోవడంతోపాటు 266 ఆయుధాలను అప్పగించారు. 

తెలంగాణకు చెందిన ఏడుగురు మావోయిస్టులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, గణపతి భార్య జోడే రత్నాబాయి, హనుమకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌ , సికింద్రాబాద్‌కు చెందిన వార్త శేఖర్‌ , హైదరాబాద్‌కు చెందిన నక్క సుశీల అలియాస్‌ రేల, సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, భద్రాది జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్‌ ఉన్నారు.  

గణపతి లొంగుబాటుపై ఇప్పటికే తీవ్ర చర్చ.. 
దేశాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాలన్నా...అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించాలన్నా..అధికారిక రికార్డుల్లో ఉన్న మావోయిస్టులంతా అయితే లొంగిపోయారని, లేదంటే చనిపోయారని గుర్తించాల్సిందే. మావోయిస్టు అగ్రనేత, సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన నేత, తెలంగాణలో జగిత్యాల జిల్లా బీర్పూర్‌కు చెందిన కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి లొంగుబాటుపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. 

తెలంగాణ పోలీసులతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్, ఇతర దర్యాప్తు విభాగాలు సైతం గణపతి జాడ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల లొంగిపోయిన దేవ్‌జీ, రాజిరెడ్డి సహా కేంద్ర కమిటీ సభ్యుల స్థాయిలో పని చేసిన వారు కూడా తమకు గణపతి జాడ తెలియదని చెబుతున్న నేపథ్యంలో గణపతి లొంగుబాటు సాధ్యమా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

మార్చి 31 తర్వాత పరిస్థితి ఏంటి? 
సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన దాడులను ఎదుర్కోలేక మావోయిస్టు అగ్ర నాయకత్వం సైతం అడవులు వీడి లొంగుబాట పడుతున్నా..ఇంకా వందల మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.అజ్ఞాతం వీడేందుకు కొందరు అంగీకరించడం లేదు. అయితే మార్చి 31 తర్వాత మిగిలే మావోయిస్టులపట్ల కేంద్రం వైఖరి ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. లొంగకపోతే మార్చి 31 తర్వాత మావోయిస్టుల ఏరివేత తప్పద న్న సంకేతాలే పంపుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కోసం మరోసారి గడువు పెంచుతారా..లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.

నిషేధం ఎత్తివేత షరతు ఫలించేనా?
తాము అజ్ఞాతం వీడి జనంలో జనం మధ్య, ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన ఎంతో మంది కేంద్ర కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే, మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే..అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెబుతున్నారు. 

ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశంలోనూ మావోయిస్టు మాజీ కీలక నేతలు ప్రతిపాదించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను ఢిల్లీలో స్వయంగా కలిసి చెప్పారు. అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

Advertisement
 
Advertisement
Advertisement