కరోనా పేరు తెలియని అడవిబిడ్డలు

Adivasi People Do Not Know Coronavirus In Eturnagaram Area - Sakshi

కరోనా.. కొత్త జ్వరమా!

అడవి మధ్యలో ఆహ్లాదకర జీవనం

కరోనాకు వెరువని ఆదివాసీలు

ఏటూరునాగారం: మీ గూడెంలో ఎవరికైనా కరోనా వచ్చిందా.. అని ప్రశ్నించినప్పుడు వారు చెప్పే సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవును.. అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనం సాగించే వారికి కరోనా అంటే కొత్తగా వచ్చిన జ్వరం అని మాత్రమే తెలుసు.! ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కోవిడ్‌ ఆ గూడెం పొలిమేర కూడా దాటకపోవడం గమనార్హం. సుమారు 15 సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన వీరు ఏటూరునాగారం గ్రామ పంచాయతీలోని మామిడిగూడెంలో కరోనా వంటి మహమ్మారి ఆనవాళ్లు కూడా తాకకుండా ఆనందంగా జీవనం సాగిస్తోన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నం కావడం తప్ప మరో ద్యాస లేకుండా ఉంటున్నారు. గ్రామంలోని ఉన్న ఇళ్లు దూరం దూరంగా ఉంటూ అన్ని రకాల చెట్ల మధ్యలో నివసిస్తుంటారు. రిజర్వు ఫారెస్టు కావడంతో పక్కా ఇళ్లు లేకున్నా గూనపెంకులు, మట్టి గోడలను నిర్మించుకొని సావాసం చేస్తున్నారు. 

విభిన్నమైన అలవాట్లు
గూడేనికి ఆనుకొని ప్రవహిస్తున్న జంపన్నవాగులోని చెలిమల నీటినే నేటికీ తాగునీటిగా వాడుతారు. ఇప్ప పువ్వులను వండుకొని తింటారు. గంజి, అంబలి, లద్దా లాంటివి సేవిస్తారు. ఇప్ప పువ్వు సారను తాగుతుంటారు. కట్టుబొట్టు అంతా విభిన్నంగా ఉంటుంది. ఒకరింటికి ఒకరు పోవడం గానీ, ఒకరి ఆహారం మరొకరు తీసుకోవడం వంటివి చేయరు. ఎవరి ఇంటిలో వారే వండుకోవడం, ఎవరి ఆహారాన్ని వారే సమకూర్చుకుంటారు. అడవిలో లభించే నల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పుట్టగొడుగులు ఆహారంగా తీసుకుంటారు. ఏటూరునాగారంలో ప్రతీ శనివారం నిర్వహించే సంతకు వచ్చి వారానికి సరిపడా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. అలాగే ఇప్ప పువ్వును బియ్యానికి విక్రయిస్తారు. పువ్వు ఇచ్చి బియ్యాన్ని తీసుకోవడం వారి అలవాటు. కూలీ పనులకు పోయి వస్తే వెంటనే వాగుల్లోకి వెళ్లి స్నానం చేసిన తర్వాతనే గూడెంలోకి వస్తామని గూడెం ప్రజలు చెబుతున్నారు. శానిటైజేషన్‌  అంటే వారికి తెలియదు. శానిటైజర్‌ బాటిళ్లు ఎలా ఉంటాయో కూడా తెలియవు. మూతికి మాస్క్‌ కూడా ఆ గూడెంలో ఎవరు కట్టుకోరు. కరోనాతో ప్రపంచం వణుకుతోన్న ఈ రోజుల్లో కూడా వారు స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నారు.

కరోనా వచ్చిందా..
మీ గూడెంలో ఎవరికైనా కరోనా వచ్చిందా.. అంటే రాలేదు.. రాదు ధీమాగా చెబుతున్నారు ఈగూడెంవాసులు. ఆ గూడెంలోని జనులను సాక్షి పలకరించగా.. పలు విషయాలను వెల్లడించారు. ఏ ఇంటికి వెళ్లి అడిగినా కరోనా వచ్చిందా అంటే రాలేదనే సమాధానమే వస్తుంది. కరోనా అంటే తెలుసా అంటే కొత్తగా వచ్చిన జ్వరం కదా అని వారి అమాయకమైన మాటలు వింటుంటే విచిత్రంగా ఉంది. కరోనా పేరు చెబితే గడగడలాడుతున్న నేటి తరుణంలో కరోనా అంటే ఉట్టి జ్వరం అన్న ఆలోచనలో ఉండడం గమనార్హం. ఇదేకాకుండా వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో వారికి ఏదైనా వ్యాధులు వస్తే చెట్ల పసర్లు, మంత్రాలతోనే నయం చేసుకునేవారు. ఈ మధ్య కాలంలోనే ఆ గూడేనికి ఏఎన్‌ఎంలు వెళ్లి చికిత్సలు అందిస్తున్నారు. లేకుంటే వారికి చెట్ల పసర్లు, మూలికలతోనే వారి రోగాలకు చికిత్సలు చేయించుకునేవారు. కరోనా వైరస్‌ వారి ధరి చేరకపోవడం సంతోషకరం. అయితే వారు ఎప్పుడు కూడా గుమికూడిన ప్రదేశాల్లో ఉండరు. ఎవరిని ముట్టుకోరు. షాపుల దగ్గరకు వస్తే దూరంగా ఉంటూ సామాన్లను సేకరిస్తుంటారు. వారికి తెలియకుండానే కరోనా నియమాలను పాటించడం గమనార్హం.

గిరిజనుల అలవాట్లు

  • ఇంటికి ఇంటికి మధ్య దూరం ఉంటుంది.
  • ఆ గూడెంలోకి ఎవరు రాకుండా కుక్కలు కాపలా ఉంటాయి.
  • గూడెంలోకి కొత్త వ్యక్తి వస్తే పది అడుగుల దూరం నుంచి మాట్లాడి పంపిస్తారు.
  • గ్రామం చుట్టూ దట్టమైన అడవి, ఒక పక్క వాగు నీరు 
  • ఎలాంటి విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు, కూలర్లు ఉండవు.
  • ప్రతి ఇంటి వద్ద రాత్రి వేళలో నెగడు (కర్రలతో నిప్పుపెట్టుకొని ) ఉంటారు.  

పొద్దుగాల అడవికి పోతం
లేవగానే ముఖం కడుక్కొని అడవికి పోతాం. అడవిలో కావాలి్సన ఫలాలను సేకరిస్తాం. తునికిపండ్లు సేకరించి ఇంటికి తెచ్చుకొని పిల్లలకు ఇస్తాం. కట్టెలు కొట్టడం, ఇంటిచుట్టూ శుభ్రం చేస్తుంటాం. మాకు కావాలి్సన ఆహారాన్ని తయారు చేసుకొని ఉదయమే తింటాం. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకొని పడుకుంటాం. మాకు ఈ కరోనా గురించి పెద్దగా తెలవదు.   
- అడమయ్య, మామిడిగూడెం

కరోనా అంటే భయం లేదు
కరోనా వైరస్‌ మాకు వస్తుందనే భయం లేదు. ఎందుకంటే మేము ఎటు పోవడం లేదు. మా గూడేనికి ఎవరు రావడం లేదు. అది మనుషులతోనే వస్తుందని తెలుసు. ఇప్పటి వరకు మా గూడెంలోని ఎవరికి రాలేదు. అందరం మంచిగానే ఉన్నాం. స్కూళ్లు కూడా బంద్‌ కావడంతో సారు కూడా రావడం లేదు. కరోనా వైరస్‌ అంటే పెద్దగా మేము పట్టించుకోవడం లేదు.
- మహేశ్, మామిడిగూడెం

ముందస్తు అవగాహన 
మామిడిగూడెంలోని గిరిజనులకు ముందస్తుగా అవగాహన కల్పించాం. ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని వివరించాం. గ్రామానికి ఎవరైనా వస్తే వెంటనే పంపించి వేయాలని సూచనలు చేశాం. గ్రామంలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు వస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఫోన్‌ నంబర్లను అందుబాటులో పెట్టాం. గ్రామానికి వచ్చిపోయే వారు ఎవరు కూడా లేకపోవడంతో వారికి కరోనా భయం లేదు. కరోనా వచ్చే అవకాశాలు కూడా తక్కువే. 
- ఈసం రామ్మూర్తి, ఏటూరునాగారం సర్పంచ్‌

చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా..
చదవండి: చెరువులో విషప్రయోగం..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top