breaking news
Adivasi life
-
కరోనా పేరు తెలియని అడవిబిడ్డలు
ఏటూరునాగారం: మీ గూడెంలో ఎవరికైనా కరోనా వచ్చిందా.. అని ప్రశ్నించినప్పుడు వారు చెప్పే సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవును.. అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనం సాగించే వారికి కరోనా అంటే కొత్తగా వచ్చిన జ్వరం అని మాత్రమే తెలుసు.! ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కోవిడ్ ఆ గూడెం పొలిమేర కూడా దాటకపోవడం గమనార్హం. సుమారు 15 సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వీరు ఏటూరునాగారం గ్రామ పంచాయతీలోని మామిడిగూడెంలో కరోనా వంటి మహమ్మారి ఆనవాళ్లు కూడా తాకకుండా ఆనందంగా జీవనం సాగిస్తోన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నం కావడం తప్ప మరో ద్యాస లేకుండా ఉంటున్నారు. గ్రామంలోని ఉన్న ఇళ్లు దూరం దూరంగా ఉంటూ అన్ని రకాల చెట్ల మధ్యలో నివసిస్తుంటారు. రిజర్వు ఫారెస్టు కావడంతో పక్కా ఇళ్లు లేకున్నా గూనపెంకులు, మట్టి గోడలను నిర్మించుకొని సావాసం చేస్తున్నారు. విభిన్నమైన అలవాట్లు గూడేనికి ఆనుకొని ప్రవహిస్తున్న జంపన్నవాగులోని చెలిమల నీటినే నేటికీ తాగునీటిగా వాడుతారు. ఇప్ప పువ్వులను వండుకొని తింటారు. గంజి, అంబలి, లద్దా లాంటివి సేవిస్తారు. ఇప్ప పువ్వు సారను తాగుతుంటారు. కట్టుబొట్టు అంతా విభిన్నంగా ఉంటుంది. ఒకరింటికి ఒకరు పోవడం గానీ, ఒకరి ఆహారం మరొకరు తీసుకోవడం వంటివి చేయరు. ఎవరి ఇంటిలో వారే వండుకోవడం, ఎవరి ఆహారాన్ని వారే సమకూర్చుకుంటారు. అడవిలో లభించే నల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పుట్టగొడుగులు ఆహారంగా తీసుకుంటారు. ఏటూరునాగారంలో ప్రతీ శనివారం నిర్వహించే సంతకు వచ్చి వారానికి సరిపడా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. అలాగే ఇప్ప పువ్వును బియ్యానికి విక్రయిస్తారు. పువ్వు ఇచ్చి బియ్యాన్ని తీసుకోవడం వారి అలవాటు. కూలీ పనులకు పోయి వస్తే వెంటనే వాగుల్లోకి వెళ్లి స్నానం చేసిన తర్వాతనే గూడెంలోకి వస్తామని గూడెం ప్రజలు చెబుతున్నారు. శానిటైజేషన్ అంటే వారికి తెలియదు. శానిటైజర్ బాటిళ్లు ఎలా ఉంటాయో కూడా తెలియవు. మూతికి మాస్క్ కూడా ఆ గూడెంలో ఎవరు కట్టుకోరు. కరోనాతో ప్రపంచం వణుకుతోన్న ఈ రోజుల్లో కూడా వారు స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా వచ్చిందా.. మీ గూడెంలో ఎవరికైనా కరోనా వచ్చిందా.. అంటే రాలేదు.. రాదు ధీమాగా చెబుతున్నారు ఈగూడెంవాసులు. ఆ గూడెంలోని జనులను సాక్షి పలకరించగా.. పలు విషయాలను వెల్లడించారు. ఏ ఇంటికి వెళ్లి అడిగినా కరోనా వచ్చిందా అంటే రాలేదనే సమాధానమే వస్తుంది. కరోనా అంటే తెలుసా అంటే కొత్తగా వచ్చిన జ్వరం కదా అని వారి అమాయకమైన మాటలు వింటుంటే విచిత్రంగా ఉంది. కరోనా పేరు చెబితే గడగడలాడుతున్న నేటి తరుణంలో కరోనా అంటే ఉట్టి జ్వరం అన్న ఆలోచనలో ఉండడం గమనార్హం. ఇదేకాకుండా వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో వారికి ఏదైనా వ్యాధులు వస్తే చెట్ల పసర్లు, మంత్రాలతోనే నయం చేసుకునేవారు. ఈ మధ్య కాలంలోనే ఆ గూడేనికి ఏఎన్ఎంలు వెళ్లి చికిత్సలు అందిస్తున్నారు. లేకుంటే వారికి చెట్ల పసర్లు, మూలికలతోనే వారి రోగాలకు చికిత్సలు చేయించుకునేవారు. కరోనా వైరస్ వారి ధరి చేరకపోవడం సంతోషకరం. అయితే వారు ఎప్పుడు కూడా గుమికూడిన ప్రదేశాల్లో ఉండరు. ఎవరిని ముట్టుకోరు. షాపుల దగ్గరకు వస్తే దూరంగా ఉంటూ సామాన్లను సేకరిస్తుంటారు. వారికి తెలియకుండానే కరోనా నియమాలను పాటించడం గమనార్హం. గిరిజనుల అలవాట్లు ఇంటికి ఇంటికి మధ్య దూరం ఉంటుంది. ఆ గూడెంలోకి ఎవరు రాకుండా కుక్కలు కాపలా ఉంటాయి. గూడెంలోకి కొత్త వ్యక్తి వస్తే పది అడుగుల దూరం నుంచి మాట్లాడి పంపిస్తారు. గ్రామం చుట్టూ దట్టమైన అడవి, ఒక పక్క వాగు నీరు ఎలాంటి విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, కూలర్లు ఉండవు. ప్రతి ఇంటి వద్ద రాత్రి వేళలో నెగడు (కర్రలతో నిప్పుపెట్టుకొని ) ఉంటారు. పొద్దుగాల అడవికి పోతం లేవగానే ముఖం కడుక్కొని అడవికి పోతాం. అడవిలో కావాలి్సన ఫలాలను సేకరిస్తాం. తునికిపండ్లు సేకరించి ఇంటికి తెచ్చుకొని పిల్లలకు ఇస్తాం. కట్టెలు కొట్టడం, ఇంటిచుట్టూ శుభ్రం చేస్తుంటాం. మాకు కావాలి్సన ఆహారాన్ని తయారు చేసుకొని ఉదయమే తింటాం. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకొని పడుకుంటాం. మాకు ఈ కరోనా గురించి పెద్దగా తెలవదు. - అడమయ్య, మామిడిగూడెం కరోనా అంటే భయం లేదు కరోనా వైరస్ మాకు వస్తుందనే భయం లేదు. ఎందుకంటే మేము ఎటు పోవడం లేదు. మా గూడేనికి ఎవరు రావడం లేదు. అది మనుషులతోనే వస్తుందని తెలుసు. ఇప్పటి వరకు మా గూడెంలోని ఎవరికి రాలేదు. అందరం మంచిగానే ఉన్నాం. స్కూళ్లు కూడా బంద్ కావడంతో సారు కూడా రావడం లేదు. కరోనా వైరస్ అంటే పెద్దగా మేము పట్టించుకోవడం లేదు. - మహేశ్, మామిడిగూడెం ముందస్తు అవగాహన మామిడిగూడెంలోని గిరిజనులకు ముందస్తుగా అవగాహన కల్పించాం. ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని వివరించాం. గ్రామానికి ఎవరైనా వస్తే వెంటనే పంపించి వేయాలని సూచనలు చేశాం. గ్రామంలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు వస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లను అందుబాటులో పెట్టాం. గ్రామానికి వచ్చిపోయే వారు ఎవరు కూడా లేకపోవడంతో వారికి కరోనా భయం లేదు. కరోనా వచ్చే అవకాశాలు కూడా తక్కువే. - ఈసం రామ్మూర్తి, ఏటూరునాగారం సర్పంచ్ చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. చదవండి: చెరువులో విషప్రయోగం.. -
ఆదివాసీల గోదారమ్మ
గిరిజనుల జీవనం చెట్టు... పుట్ట... మధ్య ప్రకృతితో ముడివడి ఉంటుంది. దాంతో ఆదివాసీల జీవన విధానంలో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. గోదావరి తీరాన నివసించే ఆదివాసీలకూ ఓ ప్రత్యేకమైన జీవనశైలి ఉంది. గోదావరికి ఉన్నట్లే వారి జీవనశైలికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, ప్రధాన్‌లు, కొలామ్లు వంటి 14 గిరిజన తెగలున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోభా ఆలయం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఉంది. ఇది గోదావరి తీరానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏటా జాతర సందర్భంగా వారు తమ దైవాన్ని గోదావరి జలంతోనే అభిషేకిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆనవాయితీని తప్పరు. ఏటా జాతరకు ముందు గూడెంలోని వాళ్లు ఒక బృందంగా ఏర్పడి కుండలతో గోదావరి జలం కోసం బయలుదేరుతారు. ఒక్కొక్కరు ఒక్కో కుండను మోస్తూ వందకిలోమీటర్ల దూరాన్ని కాలినడకనే వెళ్తారు. అయితే ఇక్కడో నిబంధన ఉంటుంది. ఒక ఏడాది వెళ్లిన దారిలో మరో ఏడాది వెళ్లకుండా మార్గాన్ని నిర్ణయించుకుంటారు. గోదావరి నది తీరం నుంచి నాగోబా ఆలయం వరకు ఉన్న ఆదివాసీల గూడేలను కలుపుకుంటూ జలయాత్ర సాగుతుంది. ఏడాదికి కొన్ని గూడేల చొప్పున ఈ జలయాత్రకు మార్గంగా మారతాయన్నమాట. వీరు పుష్కరాల సమయంలో గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేస్తారు. రాష్ట్రంలో ప్రసిద్ధి! ఈ నది ఒడ్డునే వారి ఆరాధ్య దైవం పద్మల్ పూరి కాకో (పెద్ద అమ్మమ్మ) అమ్మవారు వెలిసింది. దండేపల్లి మండలంలోని గుడిరేవు వద్ద గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం వరదల తాకిడికి శిథిలమైంది. ప్రస్తుతం పద్మల్ పూరికాకో విగ్రహాలను అక్కడే ఉన్న చెట్టు కింద ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఏడాదికి రెండు ఉత్సవాలు! దసరా - దీపావళి పండగల మధ్య రోజుల్లో భారీ ఎత్తున జరిగే ఈ ఉత్సవాలను దండారి ఉత్సవాలుగా వ్యవహరిస్తారు. పుష్య మాసంలో పెర్షాపెన్ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలు, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆదివాసీలు కూడా వస్తారు. గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని నిష్ఠతో కొలుస్తారు. కోళ్లు, మేకలు బలిచ్చి భోజనాలు చేస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా చేసే గుస్సాడి నృత్యాలు అలరిస్తాయి. ఉత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా కొందరు కాకో అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలతో గోదారమ్మను శాంతింప చేయాలని వారి విశ్వాసం. - పాత బాలప్రసాద్, బ్యూరోఇన్‌చార్జి, ఫొటోలు: మోదంపురం వెంకటేష్, ఆదిలాబాద్ గోదారమ్మకు శాంతి జేస్తాం... ఏటా గోదారమ్మకు శాంతి పూజలు జేస్తాం. పుష్కరాల సమయంలో కూడా ఈ పూజలు నిర్వహిస్తాం. స్నానాలు చేస్తాం. అగ్గినిపుకలను అగ్గి ఉండగానే పొడి చేసి, పసుపు, కుంకుమతో పాటు మరో ఏడు రకాల రంగుల పిండితో పట్టు పరుస్తాం. బియ్యం పోసి, తెల్లకోడి, నల్లకోడితో పూజలు చేసి వాటన్నింటిని ఆకులతో చేసిన డొప్పల్లో పెట్టి గోదావరిలో వదులుతాం, అలా గోదారమ్మకు శాంతి చేసి అందరం నదిలో స్నానాలు చేస్తాం. ఆ తర్వాత మా ఆరాధ్య దైవాలకు పూజలు చేస్తాం. - రాయిసిడాం దాము పటేల్, వందుర్‌గూడ, దండేపల్లి మండలం ఆదిలాబాద్ జిల్లా