
హన్మకొండ: చట్టవిరుద్ధంగా పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులను తెలంగాణలోని హన్మకొండలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ స్కేల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పాంగోలిన్ అనేది చెదపురుగులను తినే ఒక ప్రత్యేక తరహా క్షీరదం. దీని పొలుసులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సంప్రదాయ చైనీస్ వైద్యంలో పాంగోలిన్ స్కేల్స్ ఉపయోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా అక్రమంగా రవాణా చేసే క్షీరదాలలో పాంగోలిన్లు ఒకటి. కాగా చట్టవిరుద్ధంగా పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారాన్ని కొందరు నిర్వహిస్తున్నారనే నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు తెలంగాణలోని హన్మకొండలో నిఘా వేసి, నలుగురు వ్యాపారులను పట్టుకున్నారు. వారి నుండి మొత్తం 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ స్కేల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పాంగోలిన్‌లను ప్రధానంగా చైనా, ఆగ్నేయాసియాలో వేటాడుతుంటారు. వాటి విలువైన పొలుసుల కోసమే ఈ వేట సాగుతుంది. వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 షెడ్యూల్-Iలో జాబితాలో ఇండియన్ పాంగోలిన్ ఉండటంతో పాటు ఇటువంటి జంతువుల వేటపై నిషేధం అమలులో ఉంది. కాగా ఈ 6.53 కిలోల పొలుసులు సుమారు ఐదు భారతీయ పాంగోలిన్ల నుండి సేకరించారని అంచనా. కాగా వీటి వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులను డీఆర్‌ఐ అధికారులు తదుపరి దర్యాప్తు కోసం హన్మకొండలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు అప్పగించారు.