6.6 లక్షల మందికి కరోనా.. వచ్చింది.. పోయింది! | 6 Lakh From Hyderabad May Have Been Infected With COVID-19 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా.. వచ్చింది.. పోయింది!

Aug 20 2020 1:52 AM | Updated on Aug 20 2020 9:24 AM

6 Lakh From Hyderabad May Have Been Infected With COVID-19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 6.6 లక్షల మందికి కరోనా వచ్చి.. వెళ్లిపోయిందా? లక్షణాలు లేకపోవడంతో తమకు వైరస్‌ సోకిన విషయం కూడా చాలామందికి తెలియదా? అంటే ఔననే అంటున్నారు పరిశోధకులు. హైదరాబాద్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్యపై సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన, ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు వెలుగు చూశాయి. నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి మానవ వ్యర్థాలు, నీటి నమూనాలు సేకరించి విశ్లేషించారు.

దాదాపు 2 లక్షల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డట్టు గుర్తించారు. అయితే, నగర జనాభా ద్వారా విసర్జితమయ్యే మురుగులో 40 శాతం మాత్రమే శుద్ధి కేంద్రాలకు చేరుతోంది కాబట్టి.. మిగిలిన మురుగునూ లెక్కలోకి తీసుకుంటే సుమారు 6.6 లక్షల మందిలో వైరస్‌ ఉంటుందని అంచనా వేశారు. వీరిలో ఇప్పటికే అధికశాతం మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం కొద్ది శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. మరోవైపు మురుగునీటి ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

మురుగునీటిలో వైరస్‌ ఆనవాళ్లు
కరోనా బాధితుల దగ్గు, తుమ్ముల ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాప్తిస్తుందన్నది తెలిసిందే. అయితే వీటితోపాటు మలమూత్రాల ద్వారా కూడా వైరస్‌ పరిసరాల్లోకి చేరుతుంది. వైరస్‌ బారినపడ్డ తరువాత కనీసం 35 రోజుల వరకు వీరు వైరస్‌ అవశేషాలను వ్యర్థాల ద్వారా బయటకు వదులుతుంటారు. ఈ కారణంగానే సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులు ఎంత మేరకు విస్తరించాయో తెలుసుకునేందుకు మురుగునీటి విశ్లేషణను ఒక మేలైన మార్గంగా నిపుణులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఎంతమందిలో వైరస్‌ ఉందో సుమారుగా తెలుసుకునేందుకు పరిశోధన చేపట్టాయి. హైదరాబాద్‌లో రోజుకు 180 కోట్ల లీటర్ల నీరు వినియోగిస్తుండగా, ఇందులో 40 శాతం నీటిని వేర్వేరు ప్రాంతాల్లోని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తుంటారు. వీటిల్లో ప్రధానమైన కొన్ని కేంద్రాల నుంచి సీసీఎంబీ, ఐఐసీటీలు మురుగునీటి నమూనాలు సేకరించి పరిశీలించాయి. శుద్ధీకరించే ముందు నీటిలో కరోనా వైరస్‌జన్యు పదార్థపు ఆనవాళ్లు కనిపించగా.. శుద్ధి తరువాత మాత్రం దాదాపు లేకుండా పోయాయని సీసీఎంబీ తెలిపింది. (సందేహాలకు సమాధానమిస్తాం: కేసీఆర్‌)

రెండు లక్షల మందికి కోవిడ్‌ వైరస్‌?
హైదరాబాద్‌లోని మురుగునీటిపై సీసీఎంబీ, ఐఐసీటీ జరిపిన పరిశోధన ప్రకారం నగరంలో కనీసం రెండు లక్షల కంటే ఎక్కువ మంది ద్వారా వైరస్‌ వ్యర్థాల్లో కలిసినట్టు వెల్లడైంది. లీటర్‌ మురుగునీరు/వ్యర్థంలోని వైరస్‌ జన్యుపదార్థపు నకళ్ల సంఖ్య – జనాభా ఆధారంగా ఎంతమందికి వైరస్‌ సోకి ఉంటుందో గుర్తించేందుకు రెండు రకాల లెక్కలు అందుబాటులో ఉన్నాయని సీసీఎంబీ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ రెండు పద్ధతుల ఆధారంగా వేసిన లెక్కల ద్వారా నగరంలో రెండు లక్షల కంటే ఎక్కువ మంది నుంచి వైరస్‌ నకళ్లు విసర్జితమవుతున్నట్లు గుర్తించారు. అలాగే శుద్ధిచేయని మురుగునీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య 6.6 లక్షల వరకు ఉండొచ్చునని సీసీఎంబీ, ఐఐసీటీ అంచనా వేశాయి. వైరస్‌ సోకినవారు 35 రోజుల వరకు వైరస్‌ నకళ్లను విసర్జించే అవకాశం ఉన్నందున గత నెల రోజుల్లో 6.6 లక్షల మందిలో వైరస్‌ ఉన్నట్లు లెక్కించారు. వ్యాధి లక్షణాలున్న వారు, లేనివారితోపాటు వైరస్‌ బారినపడి కోలుకున్న వారు కూడా ఇందులో ఉంటారని వివరించారు. ఇప్పటికే వీరిలో పెద్ద సంఖ్యలో ప్రజలు కోలుకుని ఉంటారని.. చాలా తక్కువశాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉంటాయని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటివరకు కోవిడ్‌ బారినపడ్డ వారు 46,425 మంది మాత్రమే!

లక్షణాలు లేనివారే ఎక్కువ: సీసీఎంబీ డైరెక్టర్‌
హైదరాబాద్‌లో సుమారు 6.6 లక్షల మంది కరోనా వైరస్‌ బారినపడి ఉండవచ్చునని తమ పరిశోధన చెబుతోందని.. వీరిలో లక్షణాలు లేనివారు, తత్ఫలితంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రానివారే అధికంగా ఉండి ఉండవచ్చునని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. లక్షణాల్లేని వారు ఎక్కువగా ఉండటం వల్లే ఆసుపత్రుల్లో రద్దీ సాపేక్షంగా తక్కువగా ఉందని, పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజారోగ్య వ్యవస్థలకు వీలైందని చెప్పారు. మురుగునీటిపై తాము నిర్వహించిన పరిశోధనను జీహెచ్‌ఎంసీ వంటి పౌరసేవల సంస్థలతో కలిసి నిర్వహిస్తే నగరంలోని హాట్‌స్పాట్స్‌ను మరింత సమర్థంగా గుర్తించడంతోపాటు వాటి పర్యవేక్షణ, ఇన్‌ఫెక్షన్‌ రేటు నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకోవచ్చునని ఆయన వివరించారు. ఐఐసీటీ శాస్త్రవేత్తలు మనుపాటి హేమలత, కొప్పేరి హరిశంకర్, ఎస్‌.వెంకట మోహన్, సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఉదయ్‌కిరణ్, సి.జి.గోకులన్, కుంచ సంతోష్‌కుమార్‌ ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement