
చనిపోయిన వారిలో పార్టీసానుభూతిపరుడి నుంచి జనరల్ సెక్రటరీ వరకు..
నక్సల్బరీ పోరాటంలోగతేడాది భారీ నష్టాలు
గెరిల్లా యుద్ధతంత్రంలో కొత్త ఎత్తుగడల అమలుకు శ్రీకారం
వెలుగులోకి వచ్చిన మావోయిస్టు కేంద్ర కమిటీ డాక్యుమెంట్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతేడాది కాలంలో సానుభూతిపరుడి నుంచి జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు వరకు మొత్తం 357 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ (సీసీ) పేరిట గత జూన్ 23న రాసిన 22 పేజీల డాక్యుమెంట్‌లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. అందులోని వివరాల ప్రకారం...బూటకపు ఎన్‌కౌంటర్లలో 80 మంది చనిపోయారని, మొత్తంగా చనిపోయిన వారిలో 136 మంది మహిళలు ఉన్నారని, ఎదురుకాల్పులు కాకుండా అనారోగ్య కారణాలతో నలుగురు, ప్రమాదంలో మరొకరు మృతి చెందారు.
నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది జిల్లా కమిటీ సభ్యులు, 83 మంది ఏరియా కమిటీ, 138 మంది పార్టీ సభ్యులు, పీఎల్‌జీఏ 17, ఇతర విభాగాల వారు 40, గుర్తించని మృతులు 36 మంది ఉంటారని వివరించింది. వీరి త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది.
చుట్టుముట్టి చంపుతున్నారు
నక్సల్బరీ విప్లవ పోరాటం మొదలైన తర్వాత ఆపరేషన్ కగార్‌తో ఏడాది వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో సెంట్రల్, స్టేట్ కమిటీ సభ్యులను కోల్పోవడంతో తీవ్ర నష్టం జరిగిందని పార్టీ సెంట్రల్ కమిటీ పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్ (29 మంది మావోయిస్టులు చనిపోయారు) తర్వాత సగటున ప్రతీ 20 రోజులకు ఒక భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోందని, ఈ ఘటనల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 35 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని తెలిపింది. 20 కిలోమీటర్ల వలయాకారంలో వేలాది మంది భద్రతాదళాలు చుట్టుముడుతూ తమపై దాడులు చేస్తున్నాయని, ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీ గల భద్రతా దళాలను తమ కేడర్ ప్రాణాలకు తెగించి ఎదుర్కోంటోందని ఆ డాక్యుమెంట్‌లో పేర్కొంది.
నిజాలు దాస్తున్నారు
ప్రతీ ఎదురుకాల్పుల ఘటనలో భద్రతాదళాల వైపు కూడా పది మందికి మించి జవాన్లు చనిపోతున్నారని సెంట్రల్ కమిటీ తెలిపింది. తమకున్న అంచనా ప్రకారం ప్రతిదాడుల్లో 70 మంది జవాన్లు చనిపోగా, 130 మంది తీవ్రంగా గాయపడి ఉంటారని అభిప్రాయపడింది. అయితే ఈ విషయాన్ని దాచి పెడుతూ కేవలం మావోయిస్టుల మరణాల లెక్కలనే పాలకులు బయటకు వెల్లడిస్తున్నారని విమర్శించింది. దీర్ఘకాలిక సాయుధ పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమేనని వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా ఈ డాక్యుమెంట్‌లో కేంద్ర కమిటీ తమ అభిప్రాయాలను తెలిపింది.
అనువైన సమయం కోసం
గెరిల్లా యుద్ధతంత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలను సరైన రీతిలో అమలు చేయనందుకే పార్టీకి నష్టాలు పెరిగాయని సీసీ వివరణ ఇచి్చంది. 2024 ఆగస్టులో పొలిట్‌బ్యూరో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్టు పేర్కొంది. వర్గ పోరాటాన్ని వికేంద్రీకరించి అటవీ, గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పార్టీని విస్తరించాలని సీసీ స్పష్టంగా పేర్కొంది. పెరిగిన నిర్బంధం, పార్టీకి వరుసగా జరుగుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ విస్తరణ వీచేగాలిలా, ప్రవహించే నీరులా ఉండాలని కేడర్‌కు కేంద్ర కమిటీ సూచించింది.
శత్రువు బలంగా ఉన్నప్పుడు ఎదురుగా నిలిచి పోరాటం చేయనక్కర్లేదని, అనువైన సమయం కోసం ఎదురుచూడాలని ఆదేశించింది. శాంతి చర్చలు జరపాలంటూ 9 రాష్ట్రాల నుంచి డిమాండ్ రావడం ఇటీవల కాలంలో కనిపించిన సానుకూల పరిణామమని ఆ పార్టీ పేర్కొంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన ఎప్పటికీ నెరవేరబోదని ధీమా వ్యక్తం చేసింది.