సంరక్షణ మరిస్తే జీతంలో 15% కోత | 15 Percent salary cut for neglecting care of Parents in Telangana | Sakshi
Sakshi News home page

సంరక్షణ మరిస్తే జీతంలో 15% కోత

Mar 30 2026 2:19 AM | Updated on Mar 30 2026 2:19 AM

15 Percent salary cut for neglecting care of Parents in Telangana

తల్లిదండ్రుల విషయంలో బాధ్యతకు చట్టబద్ధత 

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు,ప్రజాప్రతినిధులకూ వర్తింపు 

బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అడ్లూరి.. చట్టం అమలుకు ప్రత్యేక యంత్రాంగం

కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే చాలు..ఆపై రాష్ట్రస్థాయిలో కమిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రుల సంరక్షణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు సరికొత్తగా రూపొందించిన ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు–2026’ను ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. 

వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత, గౌరవప్రద జీవనానికి వీలు కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. కాగా కుటుంబ వ్యవస్థలో తగ్గుతున్న బాధ్యతలను..ఇకపై తప్పనిసరిగా నెరవేర్చేలా చేసేందుకు ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. కేంద్రం 2007లో ఇలాంటి ఓ చట్టం అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ..అంతకంటే కఠినమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.   

చట్టంలో ఏముంది..
ఈ చట్టం కట్టుదిట్టంగా అమలయ్యేలా ప్రభుత్వం ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.  ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారితో పాటు జీతభత్యాలు పొందే ప్రతి ఒక్కరికీ (ప్రజాప్రతినిధులకు కూడా) వర్తిస్తుంది.  

అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే..
పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణను బాధ్యతగా నిర్వహించకుంటే వారి వేతనంలో 15% లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం పిల్లలు పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు లేదా యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తుంది.  

నిరాదరణకు గురైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుపై జిల్లా కలెక్టర్‌ లేదా కలెక్టర్‌ నియమించిన అధికారి ఇరువర్గాలను పిలిచి విచారణ జరుపుతారు. తర్వాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయిస్తూ ఆదేశాలిస్తారు.  

దరఖాస్తును అది అందిన 60 రోజుల్లోగా తప్పకుండా పరిష్కరించాలి
ఒకవేళ అధికారి ఆదేశాలపై దరఖాస్తు దారులు సంతృప్తి చెందకున్నా, గడువులోగా పరిష్కారం చేయకున్నా రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోవృద్ధుల కమిషన్‌ ఏర్పాటు చేస్తుంది.  

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి ప్రధాన కమిషనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి నుంచి దరఖాస్తుదారుడు నేరుగా వయోవృద్ధుల కమిషన్‌లో అప్పీలు చేసుకున్న తర్వాత నెలరోజుల్లోగా
తప్పకుండా పరిష్కరించాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement