తల్లి తిట్టిందని.. సైకిల్‌ యాత్ర! | 14-year old runs away on cycle travels 50km rescued by police | Sakshi
Sakshi News home page

తల్లి తిట్టిందని.. సైకిల్‌ యాత్ర!

Apr 9 2026 9:29 AM | Updated on Apr 9 2026 10:47 AM

14-year old runs away on cycle travels 50km rescued by police

50 కిలోమీటర్ల ప్రయాణం 

‘ఆపరేషన్‌ కవచ్‌’తో అర్ధరాత్రి గుర్తింపు

తల్లిదండ్రులకు అప్పగింత

కామారెడ్డి టౌన్‌ : తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి సైకిల్‌పై పారిపోయాడు ఓ 14 ఏళ్ల బాలుడు. సైకిల్‌పైనే జాతీయ రహదారిపై 50 కిలో మీటర్లు ప్రయాణం సాగించాడు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ బాలుడిని పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించడంతో పంతానికి పోయి మంగళవారం మధ్యాహ్నం సైకిల్‌పై ఇంటి నుంచి బయల్దేరాడు. సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి అర్ధరాత్రి 11 గంటల సమయంలో కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్‌ జంక్షన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఆపరేషన్‌ కవచ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు చీకట్లో ఒంటరిగా వెళ్తున్న బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆపి ప్రేమతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

అప్పటికే కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తూ ఆందోళనలో ఉన్నవారు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ నేరాల నియంత్రణతోపాటు పౌరుల రక్షణే ఆపరేషన్‌ కవచ్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. అర్ధరాత్రి వేళ మానవీయ కోణంలో స్పందించి బాలుడి భవిష్యత్తును కాపాడిన దేవునిపల్లి పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.    


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement