హిందీ‘టెన్‌’షన్‌

10th Hindi Question Paper Leak Hanumakonda Kamalapur Center - Sakshi

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ సెంటర్‌ నుంచి బయటకు టెన్త్‌ ప్రశ్నపత్రం

స్నేహితుడి కోసం ఓ మైనర్‌ నిర్వాకం 

ఒకరి నుంచి మరొకరికి..పలు వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు 

అప్రమత్తమైన మంత్రి.. సమగ్ర విచారణకు అధికారులకు ఆదేశం 

వరంగల్‌ సీపీ రంగనాథ్‌ పర్యవేక్షణలో దర్యాప్తు 

రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో పాటు 110 మందికి పేపర్‌ 

అది పేపర్‌ లీక్‌ కాదు.. కాపీయింగ్‌ కోసం ప్రయత్నం: సీపీ రంగనాథ్‌ 

మైనర్‌తో పాటు నలుగురిపై కేసు 

జువెనైల్‌ హోంకు బాలుడు.. ఇద్దరికి రిమాండ్‌.. పరారీలో ఒకరు 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: టెన్త్‌ హిందీ ప్రశ్నపత్రం కూడా అవుటైంది. టెన్త్‌ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా.. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే, రెండోరోజే హిందీ పేపర్‌ కూడా బయటకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మంగళవారం పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాట్సాప్‌ గ్రూపులలో హిందీ ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యింది.

ఈ మేరకు అందిన సమాచారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఉమ్మడి వరంగల్‌ కలెక్టర్లు, పోలీసు కమిషనర్, ఎస్పీలు, డీఈవోలతో మాట్లాడారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో పోలీసులు సోషల్‌ మీడియాలో వైరలైన పోస్టింగ్‌ల ఆధారంగా దర్యాప్తు జరిపారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ క్వశ్చన్‌ పేపర్‌ బయటకు వచ్చినట్లు తేల్చారు. ఓ మైనర్‌ బాలుడితో పాటు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఏవీ రంగనాథ్‌ వివరాలను వెల్లడించారు.

కమలాపూర్‌ మండలానికి చెందిన ఓ  బాలుడు (16) తన స్నేహితుడికి చిట్టీలు అందించడం కోసం ఈ పని చేశాడని, దీన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి పరీక్ష రాసే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా ç‘పేపర్‌ లీక్‌’ అంటూ ప్రచారం చేశారని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

గోడెక్కి ఫొటో తీసి..  
కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి సహాయం చేసేందుకు కమలాపూర్‌ ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టు సహాయంతో గోడెక్కాడు. మొదటి అంతస్తులోని మూడవ సంబర్‌ గది కిటికి పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్‌ పేపర్‌ తీసుకుని తన సెల్‌ఫోన్‌లో 9.45కు ఫొటో తీశాడు. 9.46కు మౌటం శివ గణేష్‌కు వాట్సాప్‌లో పంపాడు.

మౌటం శివ గణేష్‌ ఉదయం 9.59 గంటలకు తన సెల్‌ఫోన్‌ ద్వారా 31 మంది సభ్యులున్న ఎస్సెస్సీ 2019–20 అనే వాట్సాప్‌ గ్రూపులో ఫార్వర్డు చేశాడు. ఆ గ్రూపులో ఉన్న గుండెబోయిన మహేశ్‌ అనే మాజీ రిపోర్టర్‌ (పస్తుతం కేఎంసీలో ల్యాబ్‌ అసిస్టెంట్‌) దూడం ప్రశాంత్‌ (మాజీ జర్నలిస్టు)కు పంపించాడు.

అతను ‘బ్రేకింగ్‌ న్యూస్‌.. రెండోరోజు పదో తరగతి పేపర్‌ లీక్‌..’ అంటూ 10.46 కల్లా హిందీ ప్రశ్నపత్రం ఓ జర్నలిస్టుల గ్రూపుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి, మరో 110 మందికి పోస్టు చేశాడు. చివరికిది సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అయ్యింది.

ఎక్కడినుంచి పేపర్‌ లీకయ్యిందో స్పష్టత లేకపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. సైబర్‌క్రైం పోలీసులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయమై ఆరా తీశారు. తీగలాగితే డొంక కదిలినట్లు ఒకరి తర్వాత మరొకరికి పోస్టయిన విషయం వెలుగులోకి వచ్చింది.  

అందరికీ నోటీసులు ఇస్తాం: సీపీ 
బాలుడితో పాటు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని, మైనర్‌ను జువైనల్‌ హోంకు, శివ గణేష్, ప్రశాంత్‌ను రిమాండ్‌కు పంపినట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు.  

మహేశ్‌ పరారీలో ఉన్నాడని, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని తెలిపారు. ఎప్పుడైనా పరీక్షకు ముందే పేపర్‌ బయటకు వస్తే దాన్ని లీక్‌ అంటామని.. పరీక్ష కేంద్రంలో క్వశ్చన్‌ పేపర్‌ ఇచ్చాక బయటకు వస్తే కాపీయింగ్‌ అంటామని కమిషనర్‌ వివరణ ఇచ్చారు. ఇలావుండగా పేపర్‌ అవుట్‌ కలకలం సృష్టించడంతో స్నేహితుడి కోసం బాలుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top