సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు 100 యూనిట్లు ఫ్రీ!

100 Units Power Free For Saloons And Laundries In Telangana - Sakshi

సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఉచితంగా విద్యుత్‌ 

12 వేల మంది లబ్ధిదారులను గుర్తించిన డిస్కంలు..

ఏసీ సెలూన్లు, స్పాలు, యంత్రాలు వాడే లాండ్రీలకు వర్తించదు

ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. త్వరలోనే నిర్ణయానికి అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ప్రతి నెలా 100 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని సర్కార్‌ భావిస్తోంది. సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీ షాపులకు గత డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ పంపిణీ సంస్థలు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి వివరాలను సేకరించాయి. ఇందులో ఏసీ సెలూన్లు, స్పాలు, వాషింగ్‌ మెషీన్లు వంటి యంత్రాలు వినియోగించే డ్రైక్లీనింగ్‌ షాపులు, లాండ్రీలకు మినహాయింపు ఇచ్చాయి. మిగిలిన సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లలో 85 శాతం వరకు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నట్టు సర్వేలో తేలింది.

రాష్ట్రంలో 10,800 సెలూన్లు..
రాష్ట్రవ్యాప్తంగా 10,800 నాన్‌ ఏసీ సెలూన్లు ఉండగా, వీటికి ప్రతి నెలా రూ.90 లక్షల వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. ఎలాంటి యంత్రాలు వినియోగించని ధోబీ ఘాట్లు, లాండ్రీలు రాష్ట్రం మొత్తం మీద కేవలం 900లోపు మాత్రమే ఉన్నట్టు సర్వేలో తేలింది. వీటన్నింటికి కలిపి నెలకు రూ.30 లక్షల లోపు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. నాన్‌ ఏసీ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఏటా రూ.14.4 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నట్టు డిస్కంల పరిశీలనలో తేలింది. సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌ సరఫరాపై ఇటీవల సీఎం కేసీఆర్‌కు పంపించిన నివేదికలో డిస్కంలు ఈ వివరాలను పొందుపర్చాయి.

85 శాతం నాన్‌ ఏసీ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయని ఈ నివేదికలో పొందుపర్చాయి. ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లు కలిపి మొత్తం 12 వేల విద్యుత్‌ కనెక్షన్లను గుర్తించినట్టు నివేదించాయి. ఈ కేటగిరీల వినియోగదారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ.15 కోట్లను డిస్కంలకు సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుంది.

సీఎంతో సీఎండీల సమావేశంలో తుది నిర్ణయం..
విద్యుత్‌ సంస్థల సీఎండీలతో త్వరలో సీఎం కేసీఆర్‌ నిర్వహించనున్న సమీక్షలో ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుని ప్రకటన చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇటు గత డిసెంబర్‌ నుంచి చెల్లించిన విద్యుత్‌ బిల్లుల మాఫీ అంశంపై సైతం ప్రకటన వచ్చే అవకాశముంది.

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ శాసనసభ ఉప ఉన్నికలు, మలి విడత మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి 2021–22 సంవత్సరానికి సంబంధించిన టారిఫ్‌ ప్రతిపా దనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను సమర్పించే అవకాశముంది. టారిఫ్‌లో సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలను పొందుపర్చనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top