
విద్యుత్ శాఖ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రాష్ట్రం యూనిట్‌గా ఏర్పాటు చేయాలని సూచన
వ్యవసాయానికి, ఇళ్లకు, స్కూళ్లు, కాలేజీలకిచ్చే ఉచిత విద్యుత్ దీని పరిధిలోకి..
విద్యుత్ రంగంలో సంస్కరణలు తప్పనిసరి అని స్పషీ్టకరణ
రుణాలపై వడ్డీ భారం తగ్గేలా చర్యలు చేపట్టాలన్న సీఎం
విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటు కానుంది. వ్యవసాయానికి, ఇళ్లకు 200 యూనిట్ల వరకు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను పర్యవేక్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేక డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇది రాష్ట్రం యూనిట్‌గా పని చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. డిస్కమ్‌ల స్థితిగతులు, ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడాలంటే విధిగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారం తగ్గించుకునేందుకు వీలుగా రీస్ట్రక్చరింగ్‌కు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీలు హరీశ్, కృష్ణభాస్కర్.. డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్, వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, రెడ్‌కో ఎండీ అనిల తదితరులతో సీఎం సమీక్ష జరిపారు.
అధిక వడ్డీ రుణాలతో డిస్కమ్‌లు డీలా..
విద్యుత్ రంగంలో సంస్కరణలు తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న సదరన్, నార్తర్న్ డిస్కమ్‌లకు అదనంగా మరో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త డిస్కమ్ పరిధిలోకి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ తీసుకు రావడం వల్ల ప్రస్తుతం ఉన్న డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. డిస్కమ్‌ల పునర్వ్యవస్థీకరణతో వాటిపై ఉన్న రుణ భారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పది శాతం వడ్డీతో తీసుకున్న రుణాలతో డిస్కమ్‌లు డీలా పడ్డాయని అన్నారు.
స్కూళ్లు, సర్కారు కార్యాలయాలకు సౌర విద్యుత్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలన్నారు. రాష్ట్ర సచివాలయానికి కూడా సౌర విద్యుత్ అందించాలని, వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సోలార్ రూఫ్ టాప్ షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు లబ్ధి చేకూర్చాలి
ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూడేళ్లలో 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించాలని చెప్పారు.