ఇసుక దోపిడీ రూ.100 కోట్లు.. పట్టించుకోని టీఎస్‌ఎండీసీ.. అక్రమార్కులతో కుమ్మక్కు?

100 crores of sand exploitation - Sakshi

వే బిల్లులు లేకుండానే అక్రమ తరలింపు 

ప్రస్తుతం తెలంగాణలో 34 యాక్టివ్‌ రీచ్‌లు 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రంలో నకిలీ వే బిల్లులతో రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ మార్గంలో తరలిపోతోందని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది.  యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా మూలంగా రెండున్నరేళ్లలో సుమారు రూ.100 కోట్లకుపైగా ఆదాయం పక్క దారి పట్టినట్లు తెలుస్తోంది.

టీఎస్‌ఎండీసీ పర్యవేక్షణలోనే నకిలీ వే బిల్లుల దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కొందరు ఇసుక రవాణాదారులు, టీఎస్‌ఎండీసీ అధికారులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు  గండి కొడుతున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ములుగు నుంచి తీగలాగితే...
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 34 యాక్టివ్‌ ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. ఇసుక లభ్యత ఉన్నచోట స్థానికులకు భాగస్వామ్యం కల్పించి టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలోని మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 6 ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి నిత్యం 300 నుంచి 600 లారీలు లోడింగ్‌ అవుతున్నాయి.

15 రోజుల క్రితం ములుగు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుక లారీని వరంగల్‌లో పోలీసులు తనిఖీ చేశారు. నకిలీ వేబిల్లులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా.. యజమానికి 8 లారీలు ఉన్నాయని, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో యజమాని చెప్పిన చోటుకు వెళ్లి లోడింగ్‌ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోకుండా నేరుగా లోడింగ్‌ చేసుకోవడం,, డబ్బులు చెల్లించడమేంటని పోలీసులకు అనుమానం వచ్చి టాస్‌్కఫోర్స్‌ అధికారులకు కేసును అప్పగించారు. 

రూపాయి చెల్లించకుండా 30 టన్నుల ఇసుక 
ములుగు, ఏటూరు ప్రాంతంనుంచి వచ్చే ఇసుక లారీలపై పోలీసులు నిఘా పెట్టారు. వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జనగాం తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి దాదాపు 40 లారీలను స్వాదీనం చేసుకున్నారు. 12 టైర్ల లారీలో 26 టన్నుల ఇసుక నింపుకుంటే రూ.10,500 చెల్లించాల్సిన కొందరు లారీ యజమానులు నకిలీ వేబిల్లులతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 26 నుంచి 30 టన్నులు తీసుకెళ్లినట్లు తేలింది.

ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారినుంచి 16 లారీలు, 65 నకిలీ వే బిల్లులు, 16 టీఎస్‌ఎండీసీ స్టాంపులు, 1 లాప్‌ టాప్, 11 సెల్‌ఫోన్‌లు, రూ. 41,000ల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక కొందరు టీఎస్‌ఎండీసీ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రతి క్వారీ వద్ద టీఎస్‌ఎండీసీకి చెందిన సూపర్‌వైజర్‌ ఉంటారు. వీరి ప్రమేయం లేకుండా ఇసుక లారీ బయటకు వెళ్లే ప్రసక్తే ఉండదు. కొందరు అధికారులు, క్వారీ నిర్వాహకులు, లారీల యజమానులు కలిసే అక్రమ దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

3 నెలల్లో 1800 లారీల ఇసుక అక్రమ తరలింపు 
జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్క భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచే మూడు నెలల్లో 1800 లారీల ఇసుక ఎలాంటి సొమ్ము చెల్లించకుండా తరలినట్లు పోలీ సు విచారణలో తేలగా, రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 యాక్టివ్‌ రీచ్‌ల నుంచి రూ.100 కోట్లకు పైగా వి లువచేసే ఇసుక తరలి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top