నిమ్స్‌లో రోబోటిక్‌ సర్జరీలు | Robotic surgeries in Nims | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో రోబోటిక్‌ సర్జరీలు

Published Mon, Jul 3 2023 4:57 AM | Last Updated on Mon, Jul 3 2023 8:27 AM

Robotic surgeries in Nims - Sakshi

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): నిమ్స్‌ ఆస్పత్రిలో సోమవారం నుంచి రోబోటిక్‌ సర్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ.31.50 కోట్లతో నిమ్స్‌ కొనుగోలు చేసిన డావెన్నీ ఎక్స్‌ఐ రోబో యంత్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. రోబోటిక్‌ సర్జరీల నిర్వహణకు నిమ్స్‌ యాజమాన్యం ఇప్పటికే సీనియర్‌ ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చింది. ఇందులో వివిధ విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోబోటిక్‌ సర్జరీ సిస్టంతో పాటుగా స్పెషా లిటీ బ్లాక్‌లోని ఆపరేషన్‌ థియేటర్లలో యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలకు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలనూ మంత్రి ప్రారంభించనున్నారు. 

ఇవీ ప్రయోజనాలు.. కార్పొరేట్‌ ఆస్పత్రులలో సుమారు రూ.1.75 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్న ఈ రోబోటిక్‌ సర్జరీలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయనున్నారు. రోబోటిక్‌ శస్త్రచికిత్స వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆపరేషన్‌ సక్సెస్‌ రేట్‌ కూడా నూటికి నూరు శాతం ఉంటుంది.

క్లిష్టమైన మూత్రాశయం, పెద్దపేగు, చిన్న పేగు, క్లోమం, కాలేయం, గర్భసంచి, అన్నవాహిక.. తదితర సర్జరీలను రోబో విధానంలో మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు. అతి సూక్ష్మమైన కేన్సర్‌ కణతులను సైతం తొలగించడానికి వీలుంటుంది. ముఖ్యంగా సర్జికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, గైనకాజీ విభాగాల్లో మరింత మెరుగైన శస్త్ర చికిత్సలు చేయడానికి వీలుంటుంది.  

వైద్య సేవల్లో దేశానికే రోల్‌మోడల్‌ : నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప 
వైద్య సేవల్లో నిమ్స్‌ ఆస్పత్రి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే చేస్తున్నామన్నారు. ఎంత పెద్ద ఆపరేషన్‌ చేయించుకున్నా రోగి మూడో రోజునే ఇంటికి వెళ్లే విధంగా దోహదపడే రోబోటిక్‌ సిస్టంను సమకూర్చుకున్నామన్నారు.

స్పెషాలిటీ బ్లాక్‌లోని ఆపరేషన్‌ థియేటర్లలో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్‌ సర్జరీ సిస్టంను ప్రస్తుతానికి సర్జికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ విభాగాలలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డాక్టర్‌ బీరప్ప తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement