సాక్షి, చైన్నె: ప్రజలందరూ వెలుగుల పండుగ దీపావళిని జరుపుకుంటున్న వేళ, తమిళనాడులో వరుస హత్యలు, హింసాత్మక సంఘటనలు తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సోమవారం ఒకే రోజులో 9 మంది దారుణ హత్యలు జరగడం శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. మాదకద్రవ్యాల బెడద, వ్యక్తిగత పగలు, గ్యాంగ్ వార్లే ఈ ఘోరాలకు ప్రధాన కారణాలుగా మారడం కలకలం రేపుతున్నది.
తేనిలోపోలీసు అధికారిపై దాడి – హత్య:
తేనిలో బాణాసంచా పేలుస్తూ రచ్చ చేస్తున్న మద్యం, మత్తు ముఠాను వారించినందుకు స్పెషల్ సబ్–ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఎస్‌ఐ) సెంథిల్‌కుమార్‌పై పోకిరీలు విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కేవలం మందలించినందుకే దారుణంగా హత్యకు గురికావడం వివాదాంశంగా మారింది. ఈ కుటుంబానికి సీఎం విజయ్ రూ. 40 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు
తిరుచ్చిలో ఇద్దరు బాలురు..
సమయపురం టోల్ బూత్ సమీపంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయ ప్రాంగణం వద్ద పూల వ్యాపారం చేసుకునే రాహుల్ (17), విశాల్ (17) అనే ఇద్దరు బాలురును గుర్తుతెలియని ముఠా కొడవళ్లతో నరికి అక్కడికక్కడే చంపేసింది. ఒక అమ్మాయి వేధింపుల వివాదంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.
మరికొన్ని చోట్ల..
శివగంగలో పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండి, పదేళ్లలో నాలుగు సార్లు బెయిల్‌పై వచ్చిన నవీన్ అనే రౌడీ దీపావళి పండుగకు ఊరికి రాగా, ప్రత్యర్థి ముఠా ఆయన్ను వేటాడి, కత్తులతో నరికి చంపేసింది. మానామదురైలోని పంచన్ గ్రామానికి చెందిన విఘ్నేష్ (23) అనే ప్రైవేట్ ఉద్యోగిని, అతని స్నేహితుడు మునీశ్వరన్‌ను ఒక ముఠా అపహరించి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో విఘ్నేష్ ప్రాణాలు కోల్పోగా, మునీశ్వరన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, చైన్నె శివారులోని తిరువళ్లూరు జిల్లాలో మణి మేఘళై అనే మహిళ ప్రేమ వ్యవహారాల వివాదంలో మెడ కోసి దారుణంగా హత్య చేయబడింది.
చైన్నె వ్యాసార్పాడిలో..
చైన్నె వ్యాసర్‌పాడి సత్యమూర్తి నగర్ 62వ బ్లాక్‌కు చెందిన ధనుష్ (19) అనే యువకుడిని, గతంలో జరిగిన కొన్ని గొడవలు, వ్యక్తిగత కక్షల కారణంగా ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్య చేశారు. సిలంబరసన్ అనే వ్యక్తి తో చిన్న గొడవగా ప్రారంభమైన వివాదం, ఆ తర్వాత ధనుష్ ఇంటికి వెళ్లి గొడవపడే స్థాయికి వెళ్ళింది. , కొడవళ్లతో ధనుష్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హతమర్చారు.
శాంతిభద్రతలపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు
ఒకే రోజులో వరుసగా తొమ్మిది హత్యలు జరగడంపై ప్రతిపక్ష నేత పళనిస్వామి సహా పలువురు నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, డీఎంకే ఎంపి కనిమొళి,అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ తదితరులు స్పందిస్తూ, ప్రతిరోజూ జరుగుతున్న హత్యలు, దోపిడీలను అరికట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. దీపావళి పండుగ వేళ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణాలను గుర్తుచేస్తూ, ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన దీపావళి పండుగ, తమిళనాడులో హత్యల పండుగగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయన్నారు. కడలూరులో హత్య నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై విచక్షణారహితంగా దాడులు చేయడం, తేనిలో ఎస్సై హత్యకు గురికావడం తమిళనాడులో విచ్ఛిన్నమైన శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేని అభద్రతా వాతావరణం నెలకొందని విమర్శించారు. రాజధాని చైన్నె నుంచి మారుమూల గ్రామాల వరకు హత్యలు సర్వసాధారణమైపోతుంటే.. సీఎం విజయ్ వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. చెడును, రాక్షసులను అంతమొందించే పండుగను జరుపుకుంటున్న వేళ, ప్రజా సమస్యలను వదిలేసి రాక్షసులను ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకునే ప్రభుత్వం ఉండటం తమిళనాడు ప్రజల దురదృష్టకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


