సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్టాత్మక వెట్రి యాత్ర పథకం కింద నడిచే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి ప్రయాణ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు, పలు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మహిళలపై రుసుము విధించడం వారిని మోసం చేయడమేనని మండిపడ్డాయి.
ఫ్రీ బస్సులకే ఛార్జీలా..?
గతంలో డీఎంకే ప్రభుత్వం పట్టణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించగా, ఆ పథకాన్ని మరింత విస్తరిస్తూ శివారు ప్రాంతాలకు నడిచే బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తూ తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ’వెట్రి యాత్ర’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, దీపావళి పండుగ రద్దీని తట్టుకోవడానికి నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే మహిళల నుంచి రూ. 5 చొప్పున ఛార్జీ వసూలు చేయడంపై వివాదం చెలరేగింది. దీనిపై యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఆర్. స్వర్ణకుమార్ మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణ పథకమని చెప్పి, పండుగ వేళ ప్రత్యేక బస్సుల్లో రూ. 5 వసూలు చేయడం మహిళలను వంచించడమేనని ఆరోపించారు. ఇప్పటికే సాగు రుణాల మాఫీ విషయంలో రైతులను మోసం చేశారని, ఇప్పుడు బస్సు ఛార్జీల పేరుతో మహిళలకూ అన్యాయం చేస్తున్నారని, వెంటనే ఉచిత ప్రయాణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలు, ఆరోపణలపై రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు స్పందించారు. పండుగల సమయంలో నిర్ణీత రూట్లలో ప్రయాణాలను పూర్తి చేసుకున్న బస్సులను, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులుగా మళ్లించినట్టు వివరించారు. సాధారణ వెట్రి పయనం సర్వీసులు పూర్తయిన తర్వాత డిమాండ్ ప్రకారం నడిపే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఎంతో ఉపశమనం కలిగించేలా కేవలం రూ. 5 రాయితీ (కన్సెషన్) ఛార్జీ మాత్రమే వసూలు చేశామని అధికారులు స్పష్టం చేశారు.


