వేలూరు: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 13న దుర్గమ్మ ఉత్సవంతో ప్రారంభం కానున్నాయి. ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనుంది. ఆఖరి రోజైన ఈనెల 24వ తేదిన అరుణాచలేశ్వరాలయం ముందు ఉదయం 4 గంటలకు భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు ఆలయం వెనుక ఉన్న మహా కొండపై మహా దీపాన్ని వెలిగించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్స వాలు ఈనెల 15వ వ తేదిన ధ్వజా రోహణంతో ప్రారంభం కానుంది. అందులో భాగంగా రెండు రోజుల ముందుగానే దుర్గమ్మ ఉత్సవంతో ఆలయ నిర్వహకులు పూజలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 21న ఉదయం 6.05 గంటలకు పంచ రథాలు బయలుదేరి అదే రోజు రాత్రికి చేరుకుంటుంది. ఆఖరి రోజైన 24వ తేదిన ఉదయం 4 గంటలకు ఆలయం ఎదుట భరణి దీపం, సాయంత్రం 2,668 అడుగుల ఎత్తుగల మహా కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఇందుకోసం ఆలయ నిర్వహకులు ఆలయంలోని స్వామి వారి వాహనాలను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అదే విధంగా స్వామి వారు మాడ వీధుల్లో వెళ్లే వివిధ వాహనాలకు మెరుగులు దిద్దే పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని కార్మికులచే శుభ్రం చేసి స్వామి వారి పూజకు ఉపయోగించే సామాగ్రిని శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా రథోత్సవానికి ఉపయోగించే సామాగ్రితో పాటూ మహా దీపం వెలిగించే మహా రాక్షస కొబ్బరిని శుభ్రంచేసి మెరుగులు దిద్దుతున్నారు. దీపోత్సవాన్ని పురష్కరించుకొని ఆలయంలోని తొమ్మిది రాజ గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా ఆలయం చుట్టూ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడంతో అరుణాచలేశ్వరాలయం విద్యుత్ కాంతులతో దగదగ లాడుతుంది.


