స్కంధ షష్టి ఉత్సవాలకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

స్కంధ షష్టి ఉత్సవాలకు సన్నద్ధం

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

● నేటి నుంచి వేడుకలు ● ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రమేష్‌

సాక్షి,చైన్నె : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుచెందూర్‌ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న స్కంధ షష్టి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాలకు భక్తుల కోసం అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి రమేష్‌ తెలిపారు.సీఎం విజయ్‌ మార్గదర్శకత్వంలో మురుగన్‌ ఆరుపడై వీడులన్నింటిలోనూ స్కంధ సష్టి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రసిద్ది చెందినది. ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో ఏటా స్కంధ షష్టి అత్యంత వేడుకగా జరుగుతుంది. ఇక, ఆరో రోజు సాగే సూర సంహారం తిలకించేందుకు దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలి రావడం బట్టి చూస్తే, ఇక్కడ వేడుకలకు భక్తులు ఏ మేరకు ప్రాధాన్యతను ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. సముద్ర తీరం ఒడ్డున కొలువు దీరిన ఈ ఆలయానికి నిత్యం భక్త జనం పోటెత్తుతూనే ఉంటారు. ఇక, స్కంధ షష్టి ఉత్సవాల్లో చెప్పనక్కర్లేదు. ఆరు రోజుల పాటుగా ఆలయ పరిసరాల్లో ఉంటూ భక్తి శ్రద్దలతో భక్తులు పూజల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవాలకు మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి రోజూ ఆలయంలో విశిష్ట పూజలు జరుగుతాయి. ఇక 15న ప్రధాన ఘట్టమైన సూరసంహారం తిరుచెందూరు సముద్ర తీరంలో అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. మరుసటి రోజు 16వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనున్నది. సూర సంహారం తిలకించేందుకు ఆరు లక్షల మందికి పైగా తరలి వచ్చే అవకాశం ఉంది.దీంతో ఏర్పాట్లు ముమ్మరంచేశారు. సూర సంహారానికి ముందుగా 5 రోజులు రోజూ లక్ష మంది చొప్పున, సూరసంహారం రోజున సుమారు 6 లక్షల మందికి పైగా కల్యాణ మహోత్సవం రోజున 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.

భక్తుల కోసం ఏర్పాట్లు..

ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం చేస్తున్న వసతులు, ఇతర ఏర్పాట్లను మంత్రి రమేష్‌ పరిశీలించారు. 11 ప్రాంతాలలో వ్రతం ఆచరించే భక్తుల కోసం ప్రత్యేక షెడ్డులను ఏర్పాటు చేశారు.300 చోట్ల 300 తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేశారు.రోజూ 15,000 మందికి అన్నదానం, ఆరు లక్షల తాగునీటి బాటిళ్లు, 1 లక్ష బిస్కెట్‌ ప్యాకెట్లు, అల్పాహారం అందించేందుకు సిద్ధమయ్యారు. దివ్యాంగులకు 4 ఉచిత బస్సులుతో పాటుగా 12 తాత్కాలిక బస్‌ స్టాప్‌లు, 10,000 వాహనాలకు పార్కింగ్‌ స్థలాలు సిద్ధంగా ఉంచారు. భక్తుల భద్రత కల్పిస్తూ 493 ప్రదేశాల్లో సీసీటీవీలు, 5,000 మందికి పైగా పోలీసులతో భద్రత, బీచ్‌ వద్ద 6 వాచ్‌ టవర్లు ఏర్పాటు చేశారు. భక్తుల ఆరోగ్య పరిరక్షణకు ఆలయ ప్రాంగణంలో, ప్రధాన ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, అంబులెన్సులను నిరంతరం సిద్ధంగా ఉంచామని మంత్రి రమేష్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement