● పుత్తూరు కొండపై చరిత్రకారుల పరిశోధనల్లో వెలుగు చూసిన గుహ నివాసాలు
సాక్షి, చైన్నె: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా రాజపాళయం సమీపంలోని పుత్తూరు కొండల్లో చరిత్రకారులు జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనల్లో అరుదైన చారిత్రక ఆధారాలు వెలుగు చూశాయి. నవీన శిలాయుగం నాటి మానవులు నివసించిన సహజసిద్ధ గుహలు, వారు ఇసుకరాతిపై గీసిన రాతి చిత్రాలు (రైఫిల్/రాక్ పెయింటింగ్స్) బయటపడటం పురావస్తు ప్రపంచంలో ప్రాధాన్యత సంతరించుకుంది. పుత్తూరు కొండ కింది భాగంలో ఉన్న కట్టిల్‌పరై కరుప్పస్వామి ఆలయ సమీపంలో పురాతన ఆధారాలు ఉన్నట్లు స్థానికుడు రాంకుమార్ సమాచారం అందించారు. ఈ సమాచారంతో రాజపాళయం రామ్‌కో ఇంజినీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ ప్రేమ్, రాజుక్కల్ కాలేజీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ కందసామిలు అక్కడ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ పరిశోధనల్లో కరుప్పస్వామి ఆలయం సమీపంలోని మూడు సహజసిద్ధ గుహల్లో నవీన శిలాయుగపు మానవ నివాస ఆధారాలను చరిత్రకారులు గుర్తించారు.
రాతి చిత్రాల ప్రత్యేకతలు
ఈ కొండలోని మిగిలిన రాతి ఆశ్రయాలతో పోలిస్తే, మానవ నివాస ఆధారాలు లభించిన ఈ మూడు గుహలకు వర్షపు నీరు లోపలికి రాకుండా నిరోధించే సహజసిద్ధమైన కప్పు నిర్మాణం ఉండటం విశేషం. గుహల నేల పైభాగంలో తెల్లటి ఇసుక,సున్నపు పూతలతో గీసిన రాతి చిత్రాలు ఉన్నాయి. ఇవి నాటి మానవుల యుద్ధ దృశ్యాలను, వారు వాడిన కత్తులు, డాలులు (రక్షణ కవచాలు) వంటి ఆయుధాలను, చుట్టూ ఉన్న జంతువుల బొమ్మలను ప్రతిబింబిస్తున్నాయి.గుహ నేలపై ధాన్యాలు, పదార్థాలను రుబ్బేందుకు వాడిన చిన్నపాటి గుంటలు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ ఆ కాలపు మానవుల జీవనశైలి, సంస్కృతికి అద్దం పడుతున్నాయి.ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు గుహల వద్ద వంటలు చేయడమో, పొయ్యిలు వెలిగించడమో చేయడం వల్ల వెలువడే పొగ, బొగ్గు వల్ల ఈ పురాతన రాతి చిత్రాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 3 వేల సంవత్సరాల చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ అరుదైన నవీన శిలాయుగపు ఆధారాలను తమిళనాడు పురావస్తు శాఖ, జిల్లా యంత్రాంగం తక్షణమే స్వాధీనం చేసుకుని, రక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


