మేఘావృతంగా చైన్నె
సాక్షి, చైన్నె : బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ఈ తుపాను అర్థరాత్రి 11.30 గంటల నుండి మంగళవారం ఉదయం 04:00 గంటల మధ్య నెల్లూరు – నరసాపురం మధ్య తీరాన్ని తాకింది. అయితే, ఈ ప్రభావం తమిళనాడుపై తక్కువే. తుపాన్ రూపంలో భారీ వర్షం పడవచ్చని ఎదురు చూసినా అంతంత మాత్రమే. సోమవారం చైన్నె, తిరువళ్లూరు జిల్లాలలో పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు. అయితే, తెరపించి తెరపించి వర్షం పడింది. అదే సమయంలో ఈ తుపాన్ తీరం తాకినానంతరం తమిళనాడులో మరింతగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం దాటే సమయంలో చైన్నె , తిరువళ్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నది. అలాగే చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, వెల్లూరు , నీలగిరి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తారుగా వర్షాలు పడ్డాయి.
ఈదురు గాలులు
తిరువళ్లూరు, చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, వెల్లూరు, తిరువణ్ణామలై, విల్లుపురం , పుదుచ్చేరిలలో గంటకు 55 నుండి 65 కి.మీ (గరిష్టంగా 75 కి.మీ) వేగంతో ఈదురు గాలులు వీయడంతో ముందు జాగ్రత్తలు సిద్దం చేశారు. ఇక , మురసు తీరం దాటినానంతం మంగళవారం నీలగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవాకశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.చైన్నె నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ కనుమల జిల్లాలు, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈనెల 4వ తేది నుంచి 7వ తేదీ వరకు తేని, దిండుగల్, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలదుత్తురై, పుదుక్కోట్టై, రామనాథపురం, తిరునల్వేలి, తూత్తుకుడి , కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు. భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
11 విమానాల సేవలు రద్దు
మురసు తుపాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైపుగా చైన్నె నుంచి వెళ్లాల్సి,రావాల్సిన విమానాల సేవలు రద్దు చేశారు. ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన ఐదు విమానాల సేవలను రద్దు చేశారు. అక్కడి నుంచి రావాల్సిన 6 విమానాల సేవలను కూడా రద్దు చేశారు. కాగా, వర్షాల ముందు జాగ్రత్తలపై వివిధ విభాగాల అధికారులతో సీఎస్ సాయికుమార్ సచివాలయంలో సమావేశమయ్యారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


