సాక్షి, చైన్నె: డీఎంకే పార్టీని పునర్వ్యవస్థీకరించి మరింత బలోపేతం చేసే దిశగా యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కసరత్తులు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ పునర్వ్యవస్థీకరణ కమిటీతో కీలక సమావేశం స్థానికంగా జరిగింది. రాబోయే ఉప ఎన్నికలకు ముందే 110 జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించడం , పార్టీ పరంగా సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. శాసనసభ ఎన్నికలలో అధికారం దూరం కావడం తదనంతర పరిణామాల అనంతరం నెలకొన్న పరిస్థితుల నుంచి డీఎంకే శ్రేణులు మరింత అప్రమత్తంగా అడుగులు వేస్తున్నారు. కొత్త ఉత్సాహాన్ని నింపే రీతిలో ఉరకలు తీస్తున్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో టీవీకే అతి స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలవడాన్ని గుర్తుచేస్తూ, రాబోయే ఉప ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.టీవీకే ప్రభుత్వ తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే దిశగా కార్యక్రమాలతో పాటుగా పార్టీ పరంగా మార్పులు చేర్పుల కసరత్తులు వేగవంతంచేశారు.
110 జిల్లాలు..
పార్టీ పరంగా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి రెండు స్థానాలను ఒక జిల్లాగా పరిగణించారు. మొత్తం 110 జిల్లాలుగా తీర్చిదిద్దారు. వీటికి జిల్లాల కార్యదర్శుల నియామకం, సంస్థాగత ఎన్నికల నిర్వహణ వ్యవహారాలపై దృష్టి పెడుతూ, త్వరలోనే అన్ని జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించాలని ఉదయనిధి ఆదేశించారు.
వయోపరిమితి – పదవీకాల నిబంధనలు
జిల్లా కార్యదర్శుల గరిష్ట వయోపరిమితిని 70 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే కొందరు జిల్లా కార్యదర్శులు వయోపరిమితిని మరో 5 ఏళ్లు పెంచాలని కోరినట్లు సమాచారం. ఒక నాయకుడు జిల్లా కార్యదర్శి పదవిలో గరిష్టంగా 3 పర్యాయా లు మాత్రమే కొనసాగేలా నిబంధన ప్రతిపాదించా రు. యూనియన్, పట్ణ, డివిజన్, రాష్ట్ర స్థాయిలో పార్టీని పునర్విభజిస్తూ నివేదిక సిద్ధం చేయాలని కమిటీని కోరారు.రాబోయే ఉప ఎన్నికలకంటే ముందే పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి డీఎంకేను ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.


