సాక్షి, చైన్నె: లోక్ భవన్‌లో జరిగిన తమిళనాడుదినోత్సవం వేడుకలలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వస్తువులను, సంక్షేమ పథకాలను ఉచితంగా అందించడం కంటే ప్రతి పౌరుడి కొనుగోలు శక్తిని, ఖర్చు చేసే సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. తమిళనాడు ఎంతో సంపన్నమైన రాష్ట్రం అయినప్పటికీ అక్షరాస్యత రేటు ఇంకా 82% నుండి 85% మధ్యనే ఎందుకు ఉందని గవర్నర్ వివరించారు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యతను సాధించేందుకు తీవ్రంగా కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వాల వల్ల మాత్రమే సాధ్యం కాదని, అందులో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తమిళనాడుకు విశిష్ట సేవలు అందించిన ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్, చంద్రయాన్–3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. వీరముత్తువేల్ సహా పలువురు ప్రముఖులను గవర్నర్ ఘనంగా సత్కరించారు.


