– ఎంకే స్టాలిన్ విమర్శలు
సాక్షి, చైన్నె : తమిళనాడుకు రావాల్సిన బహుళ జాతి కొరియన్ కంపెనీల రూ. 1,614 కోట్ల విలువైన పెట్టుబడులు ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయాయని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ, గైడెన్స్ తమిళనాడు వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా రావాల్సిన రూ. 1,614 కోట్ల కొరియన్ పెట్టుబడులు రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిపోవడానికి ప్రభుత్వంలోని నిరక్ష్యరాస్యత, అహంకారపూరిత విధానాలే కారణమని ఆయన విమర్శించారు. తమిళనాడు జీఎస్‌టీ రాబడి వృద్ధి రేటు జాతీయ సగటు కంటే పడిపోయిందని, ప్రభుత్వం హయాంలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా కుంటుపడిందని పేర్కొన్నారు. అన్ని రంగాలలోనూ రాష్ట్ర అభివృద్ధిని ఇంత వేగంగా వెనక్కి (రివర్స్ గేర్‌లోకి) తీసుకెళ్లడం ఈ ప్రభుత్వం నుంచే నేర్చుకోవాల్సి ఉందన్నారు. అసలు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేని సీఎం, ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తమిళనాడు ఆర్థిక వృద్ధిలో నిరంతర క్షీణత
భారతదేశంలో ఆర్థికంగా అగ్రగామిగా ఉన్న తమిళనాడు రాష్ట్రం ప్రస్తుత ప్రభుత్వ పాలనలో తీవ్ర ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటోందని డీఎంకే సీనియర్ నేత , మాజీ ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉత్పాదన తగ్గి, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిందని ఆయన విమర్శించారు. అక్టోబర్ నెల జీఎస్‌టీ రాబడి వృద్ధిలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక (24%), తెలంగాణ (14%), కేరళ (23%) మెరుగైన వృద్ధిని నమోదు చేయగా, తమిళనాడు మాత్రం వాటి కంటే వెనుకబడిందని తంగం తెన్నరసు గుర్తుచేశారు. రాష్ట్రానికి వస్తున్న పన్ను ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల కేవలం బయటి నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్నుల వల్లే జరుగుతోందన్నారు. తమిళనాడు స్వంత ఉత్పాదన ద్వారా వచ్చే పన్ను రాబడి గణనీయంగా తగ్గిపోతోందని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతులను పెంచడం ద్వారానే రాష్ట్ర సమగ్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. కాగా, మంత్రి నిర్మల్‌కుమార్ స్పందిస్తూ, గత పాలకులు వైఫల్యాలు, వారి మాయాజాలం పుణ్యామా తాజాగా జీఎస్టీ తగ్గిందని వివరణ ఇవ్వడం గమనార్హం.
స్టాలిన్


